న్యూఢిల్లీ, జనవరి 18: ఇప్పటికే ఎడాపెడా ప్రభుత్వ ఆస్తుల్ని విక్రయించి ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరిన్ని ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో విమానయాన శాఖ ఆస్తుల నగదీకరణ ద్వారా రూ. 20,000 కోట్లు సమీకరించేందుకు చూస్తున్నది. ఈ ప్రక్రియలో భాగంగా పలు విమానాశ్రాయాల్ని ప్రైవేటుకు అప్పగించిన మోదీ ప్రభుత్వం మరో 11-12 ఎయిర్‌పోర్టుల్ని విక్రయించవచ్చని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.
ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్న ఎయిర్‌పోర్టుల జాబితాలో కోల్‌కతా, జైపూర్, విజయవాడ, రాయపూర్, ఇండోర్ నగరాల్లోని విమానాశ్రయాలున్నాయి. ఎయిర్‌పోర్టుల విక్రయం ద్వారా రూ.8,000 కోట్లు సమీకరించాలన్నది విమానయాన మంత్రిత్వ శాఖ లక్ష్యం. ఫిబ్రవరి 1న బడ్జెట్లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడిన తర్వాత క్యాబినెట్ అనుమతి కోసం ఒక నోట్‌ను మంత్రిత్వ శాఖ పంపిస్తుందని టైమ్స్ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 146 నిర్వహణా ఎయిర్‌పోర్టులు, హెలీపోర్టులు, వాటర్ఏరోడ్రోమ్లు ఉన్నాయి.
వివిధ ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి చేపట్టిన నేషనల్ మానిటైజేషన్ ప్రొగ్రామ్ (ఎన్ఎంపీ) కింద 2022-25 మధ్యకాలంలో 25 విమానాశ్రయా ల్ని ప్రైవేటుకు అప్పగించాలని 2021లో కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకూ 8 ఎయిర్‌పోర్టుల్ని ప్రైవేటు నిర్వహణకు ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడతో పాటు తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల్ని సైతం ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా రూ.860 కోట్లు సమీకరించాలని ఇంతక్రితమే విమానయాన శాఖ నిర్ణయించింది.