న్యూఢిల్లీ, అక్టోబర్ 5: అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ ఇండియా రేటింగ్ అవుట్‌లుక్‌ను పెంచింది. ఇండియా సార్వభౌమ రేటింగ్‌ను ప్రస్తుత ‘బీఏఏ3’ స్థాయిగానే పునరుద్ఘాటిస్తూ, భవిష్యత్ రేటింగ్ పెంపునకు సంకేతంగా అవుట్‌లుక్‌ను ‘నెగిటివ్’ నుంచి ‘స్టేబుల్’కు పెంచుతున్నట్లు మంగళవారం మూడీస్ ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య వ్యవస్థల రిస్క్‌లు తగ్గుతున్నట్లుగా మూడీస్ భావించడంతో అవుట్‌లుక్‌ను పెంచింది. భారత్ జారీచేసే విదేశీ కరెన్సీ, దేశీయ కరెన్సీ దీర్ఘకాలిక బాండ్లకు ‘బీఏఏ3’ రేటింగ్‌నే కొనసాగిస్తున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ విడుదల చేసిన ప్రకటనలో వివరిస్తూ, భారత ప్రభుత్వంపై అవుట్‌లుక్‌ను మాత్రం పెంచుతున్నట్లు తెలిపింది.
‘బీఏఏ3’ రేటింగ్ జంక్ స్టేటస్కంటే ఒక అంచె ఎక్కువ. ఇది కనిష్ఠస్థాయి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌ను సూచిస్తుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో గతేడాది ఇండియా రేటింగ్‌ను ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కు మూడీస్ డౌన్‌గ్రేడ్ చేసింది. అప్పుడు అవుట్‌లుక్‌ను సైతం ‘నెగిటివ్’లో ఉంచింది. ఇప్పుడు దానినే ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇండియా జీడీపీ 9.3 శాతం వృద్ధి చెందవచ్చని మూడీస్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ వృద్ధి రేటు 7.9 శాతం మేర ఉండవచ్చని అంచనా వేసింది.
రిస్క్ తగ్గింది…
ఇండియా వాస్తవ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య వ్యవస్థల రిస్క్‌లు తగ్గుతున్నాయని, ఈ వ్యవస్థలు మరింత క్షీణించబోవన్న అంచనాలు ఏర్పడుతున్నాయని మూడీస్ తెలిపింది. అధిక ద్రవ్యత, తగినంత మూలధనం ఉన్నందున బ్యాంకులు, బ్యాంకింగేతర ఫైనాన్షియల్ సంస్థల వల్ల ప్రభుత్వానికి రిస్క్ తగ్గిందని, అయితే అధిక రుణభారంతో కూడిన రిస్క్‌లు మాత్రం కొనసాగుతున్నాయని రేటింగ్ ఏజెన్సీ వివరించింది. ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతున్నందున, వచ్చే కొద్ది సంవత్సరాల్లో ప్రభుత్వపు ద్రవ్యలోటు తగ్గుతుందని, తద్వారా సార్వభౌమ పరపతి మరింత దిగజారబోదని మూడీస్ అంచనావేసింది.