Moody`s-Adani | యూఎస్ షార్ట్ షెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికతో పూర్తిగా చిక్కుల్లో గౌతం అదానీ గ్రూప్ సంస్థలకు మరో షాక్ తగిలింది. నాలుగు అదానీ గ్రూప్ సంస్థల రేటింగ్‌ను తగ్గిస్తున్నట్లు ఇంటర్నేషనల్ రేటింగ్స్ సంస్థ `మూడీ`స్ ఇన్వెస్టర్ సర్వీస్ శుక్రవారం ప్రకటించింది. హిండెన్‌బర్గ్ నివేదికతో భారీగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయిన ఈ నాలుగు సంస్థల రేటింగ్‌ను స్టేబుల్ నుంచి నెగెటివ్‌కు మార్చేసినట్లు తెలిపింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ రిస్ట్రిక్టెడ్ గ్రూప్, అదానీ ట్రాన్స్మిషన్ స్టెప్-వన్ లిమిటెడ్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ సంస్థలకు ఇచ్చిన రేటింగ్ ఔట్‌లుక్‌ను స్టేబుల్ నుంచి నెగెటివ్‌కు మార్చేసినట్లు మూడీ`స్ ఒక ప్రకటనలో తెలిపింది. అదానీ గ్రూప్ సంస్థల్లో కార్పొరేట్ సుపరిపాలన లోపించిందని హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పతనమవుతున్నది.
ఇంతకుముందు క్రెడిట్ సూయిజ్, సిటీ బ్యాంక్.. అదానీ గ్రూప్ సంస్థలు జారీ చేసిన బాండ్లకు విలువ లేదని ప్రకటించాయి. మోర్గాన్ స్టాన్లీ కూడా అదానీ గ్రూప్ సంస్థల వెయిటేజీ పూర్తిగా తగ్గించివేసింది. అదానీ గ్రూప్ సంస్థల నుంచి నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ పూర్తి వాటాలను ఉపసంహరించుకున్నది. మరోవైపు, హిండెన్‌బర్గ్ నివేదికపై క్లారిటీ వచ్చేవరకు అదానీ న్యూ ఎనర్జీస్‌తో పార్టనర్‌షిప్‌పై ముందుకెళ్లలేమని ఫ్రాన్స్ ఎనర్జీ మేజర్ `టోటల్ ఎనర్జీస్` తేల్చి చెప్పింది.