
రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సంస్థ
హైదరాబాద్, సెప్టెంబర్ 30: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే భాగ్యనగరంలో నాలుగు యూనిట్లను ఏర్పాటు చేసిన సంస్థ.. తాజాగా సుల్తాన్పూర్ వద్ద మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న యూనిట్లలో పెయింట్స్, ఎఫ్ఎంసీజీ రంగానికి ఉపయోగపడే ప్యాకేజింగ్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్న సంస్థ..ఫార్మా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఇంజెక్షన్ బ్లో మౌల్డింగ్(ఐబీఎం) టెక్నాలజీతో సరికొత్త ఉత్పత్తులను ఈ కొత్త యూనిట్లో ఉత్పత్తి చేయబోతున్నది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.. కేవలం ఫార్మా ఎగుమతులను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఐబీఎం టెక్నాలజీతో ఈ నూతన ప్యాకేజింగ్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ఫార్మా హబ్‌గా వెలుగొందుతున్న హైదరాబాద్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు అత్యధికంగా ఔషధాలు ఎగుమతి అవుతున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్యాకేజింగ్ ప్రొడక్ట్‌లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న యూనిట్ కోసం రూ.50 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే ఈ యూనిట్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4.5 ఎకరాల భూమిని కూడా కేటాయించిందని, దీంట్లో త్వరలో నిర్మాణాలు ప్రారంభించి జనవరి-మార్చి 2023 నాటికి ఈ యూనిట్లో ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే మూడేండ్లలో రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నామని, ఈ పెట్టుబడుల్లో భాగంగా రూ.20 కోట్లతో ఉత్తరప్రదేశ్‌లో సరికొత్త యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.480 కోట్లుగా ఉన్న ఆదాయం.. వచ్చే మార్చి నాటికి రూ.600 కోట్లకు చేరుకోవచ్చన్నారు. కాగా, వచ్చే మూడు నుంచి నాలుగేండ్ల కాలంలో రూ. 1,000 కోట్ల టర్నోవర్‌ను సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది.