Realme | బ్యాంకాక్, జూలై 5: జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ భాగస్వామ్యంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఇమేజింగ్ ఫీచర్తో ఓ 5జీ స్మార్ట్ఫోన్ను చైనాకు చెందిన సంస్థ రియల్మీ తీసుకొస్తున్నది. రియల్మీ 13 ప్రో సిరీస్ 5జీలో సోనీ ఎల్వైటీ-701 కెమెరా సెన్సార్ను పెట్టనున్నారు.
ఈ మేరకు ఇక్కడ జరిగిన ఓ ప్రీ-లాంచ్ ఈవెంట్లో రియల్మీ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే ప్రపంచంలోనే ఈ కెమెరా సెన్సార్ ఫీచర్తో వస్తున్న మొదటి మొబైల్ రియల్మీదే కానున్నదంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ప్రతీ స్మార్ట్ఫోన్లో కెమెరా, దాని మెగాపిక్సల్, సెన్సార్ పరిమాణం, లెన్స్ టెక్నాలజీలే ప్రధానమైపోయాయి.
అందుకే అత్యంత నాణ్యమైన ఫొటోల కోసం 50 మెగాపిక్సల్ కలిగిన సోనీ ఎల్వైటీ-701 కెమెరా సెన్సార్ను తమ కొత్త మాడల్ మొబైల్లో పెడుతున్నామని ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో అనుబంధ సంస్థ అయిన రియల్మీ చెప్తున్నది. అయితే దీని ధర, ఇతర ఫీచర్లు, మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే తేదీ తెలియాల్సి ఉన్నది.