Minister Piyush Goyal | న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశీయ ఆన్లైన్ మార్కెట్‌పై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ వృద్ధి ఆందోళనకరమైన అంశమేనని వ్యాఖ్యానించారు. ఈ-కామర్స్ సంస్థలు అవలంభిస్తున్న ధరల విధానం బాగాలేదని, సంప్రదాయ రిటైల్ రంగాన్ని అది కూలదోస్తున్నదని మండిపడ్డారు. బుధవారం ఇక్కడ ‘భారత్‌లో ఉపాధి, వినియోగదారుల సంక్షేమంపై ఈ-కామర్స్ నికర ప్రభావం’ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంప్రదాయ రిటైల్ మార్కెట్లో ఉద్యోగ-ఉపాధి అవకాశాలను ఈ-కామర్స్ వేదికలు దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ‘ఈ దేశానికి ఈ రకమైన ధరల విధానాలు లాభం చేస్తాయా?’ అని ప్రశ్నించారు. తక్కువ ధరలతో సంప్రదాయ మార్కెట్‌కు వినియోగదారులను ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలు దూరం చేస్తున్నాయని, ఇది ఇలాగే కొనసాగితే వీధుల్లో దుకాణాలు మూతబడటం ఖాయమన్నట్టుగా మాట్లాడారు. ఆన్లైన్ మార్కెటింగ్‌తో అంతా ఎక్కడికక్కడే షాపింగ్ చేస్తున్నారని, దీనివల్ల సమాజంలో ఒక రకమైన అంతరం కూడా వ్యాపిస్తున్నదని చెప్పారు.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో పెడుతున్న పెట్టుబడులు ఇక్కడ దానికి వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేసుకోవడానికేనని గోయల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెజాన్ దాని స్వలాభం కోసమే భారత్‌లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించిందని, అంతేతప్ప భారత్‌కు మంచి చేద్దామని మాత్రం కాదన్నారు. ఆన్లైన్ మార్కెట్ పెరిగిపోతే చిరు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఇదిలావుంటే ఆన్లైన్ వ్యాపారులు దేశంలో 1.58 కోట్ల ఉద్యోగాల్ని సృష్టించారని ఈ రిపోర్టు తెలిపింది. ఇందులో 35 లక్షల మహిళలు కూడా ఉన్నారు. 17.6 లక్షల రిటైల్ సంస్థలు ఈ-కామర్స్ మార్కెట్‌తో భాగస్వాములయ్యాయని కూడా తేలిం ది. అయితే ఈ వృద్ధి దేశానికి మంచి కన్నా భవిష్యత్తులో చెడే ఎక్కువగా చేస్తుందని మంత్రి గోయల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.