హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): దేశంలో ఇతర రాష్ట్రాలకు సంక్షేమం, అభివృద్ధిలో రోల్ మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పలు దేశాల ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఐబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్స్ సమ్మిట్-2025’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొదట్లో తెలంగాణ ఏర్పాటు అసాధ్యమన్నారని.. అనతి కాలంలోనే రాష్ట్రం అన్‌స్టాపబుల్ అనే స్థాయికి ఎదిగిందని చెప్పారు.
రాష్ట్ర జీడీపీ రూ.16.12 లక్షల కోట్లకు చేరిందని.. 10.1 శాతం వృద్ధి రేటుతో దేశ సగటు (9.9%)ను దాటేసిందని వివరించారు. తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు అని.. ఇది దేశ సగటు కంటే 1.8 రెట్లు ఎకువ అని వెల్లడించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలతో తెలంగాణ పురోగతిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఆగ్రో ఇన్నోవేషన్, ఏఐ గవర్నెన్స్, స్మార్ట్ హెల్త్ సిస్టమ్స్, డిజిటల్ ఫార్మింగ్, ఫ్యూచర్ – రెడీ ఎడ్యుకేషన్, సైస్టెనబుల్ మానుఫ్యాక్చరింగ్, క్లీన్ ఎనర్జీ తదితర అంశాల్లో ప్రపంచ దేశాలతో పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు.