న్యూఢిల్లీ, జూలై 30: ప్రభుత్వ రంగ బ్యాంకులంటేనే పేద, మధ్యతరగతి వర్గాల ఖాతాదారులు ఎక్కువగా ఉంటారు. అయితే అలాంటివారి ఖాతాల్లోనూ కనీస నగదు నిల్వలు ఉండట్లేదంటూ బ్యాంకులు ఎడాపెడా చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలా 2019-20 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య మినిమం బ్యాలెన్స్‌ను మెయింటెన్ చేయని ఖాతాదారుల నుంచి జరిమానాల రూపంలో ఏకంగా రూ.8,500 కోట్లు దేశంలోని సర్కారీ బ్యాంకులు తీసుకోవడం గమనార్హం. అయితే అన్నివైపులా విమర్శలు రావడంతో భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఈ మినిమం బ్యాలెన్స్‌ను 2020-21 నుంచి పక్కనబెట్టింది. మిగతా బ్యాంకులు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 5 ఆర్థిక సంవత్సరాల్లో గత ఆర్థిక సంవత్సరమే (2023-24) అత్యధికంగా రూ.2,331 కోట్లను బ్యాంకర్లు వసూలు చేశారు. అంతకుముందుతో పోల్చితే ఈ ఐదేండ్లలో ఈ వసూళ్లు 34 శాతానికిపైగా పెరగడం గమనించదగ్గ అంశం.
ప్రస్తుతం దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. అయితే ఖాతాల్లో కనీస నగదు నిల్వల్లేవని అత్యధికంగా ఫైన్లు వసూలు చేసిన బ్యాంకుల్లో పీఎన్బీ, బీవోబీ, ఇండియన్ బ్యాంక్, కెనరా, బీవోఐ టాప్-5గా ఉన్నాయి. ఎస్బీఐ ఒక్క 2019-20లో గరిష్ఠంగా రూ.640 కోట్లు వసూలు చేసినట్టు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి అందించిన లెక్కలు చెప్తున్నాయి. ఆ తర్వాత నుంచి ఆపేసిందన్నారు. కాగా, ఆయా ప్రభుత్వ బ్యాంకులు మెట్రోలు-నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల శాఖలవారీగా సేవింగ్స్ ఖాతాల్లో కనీస నగదు నిల్వలు రూ.2 వేల నుంచి రూ.500 వరకు ఉండాలని చెప్తున్నాయి. లేకుంటే నెలనెలా రూ.250 నుంచి రూ.100దాకా జరిమానాలు వేస్తున్నాయి. ఇక కరెంట్ ఖాతాల్లో రూ.10 వేల నుంచి రూ.1,000 వరకు ఉంచాల్సిందే. లేకపోతే గరిష్ఠంగా రూ.600దాకా ఫైన్ పడుతుంది.
కార్పొరేట్ సంస్థలు వందలు, వేల కోట్ల రూపాయల్లో రుణాలు తీసుకుని, చివరకు వాటిని ఎగవేసి దర్జాగా తిరిగేస్తున్నారు. అయినా వారిని ఏమీ చేయలేకపోతున్న బ్యాంకర్లు.. సామాన్యులపై మాత్రం కన్నెర్రజేస్తుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్నామంటూ ఊదరగొడుతున్న మోదీ సర్కారు.. ఈ జరిమానాలపై నోరు మెదపట్లేదన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో అందర్నీ భాగస్వాములను చేయడం అంటే ఇదేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
నిజానికి నెలాఖర్లో చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండని బడుగు, బలహీన వర్గాలు.. ఖాతాల్లో అంతంత నగదును ఎలా? ఉంచగలుగుతారు. పింఛన్ కోసమో, సబ్సిడీల కోసమో లేక మరే ఇతర అవసరాల కోసమో వృద్ధులు, రైతన్నలు, శ్రామికులు తీస్తున్న ఈ ఖాతాల్లో కనీస నగదు నిల్వల్లేవంటూ జరిమానాల పేరిట సర్కారీ బ్యాంకులు విరుచుకుపడటం ఎంతమాత్రం సరికాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికైనా ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ తరహా విధానాలను తొలగించాలన్న డిమాండ్ గట్టిగా వస్తున్నది.