Microsoft | మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తన పదవికి రాజీనామా చేశారు. ఇతర ప్రయోజనాల కోసం ఆయన ఈ పదవి నుంచి వైదొలిగినట్లు సమాచారం. కాగా, అనంత్ మహేశ్వరి రాజీనామాను మైక్రోసాఫ్ట్ ధ్రువీకరించింది. ఆయన నిష్క్రమణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజ్మెంట్ను పునర్వ్యవస్థీకరించింది.
‘ఇతర పనుల కోసం మైక్రోసాఫ్ట్ నుంచి అనంత్ మహేశ్వరి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. భారత్‌లో కంపెనీ వ్యాపార లావాదేవీలకు ఆయన పలు సేవలు చేశారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయన భవిష్యత్ ప్రణాళికలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం’ అని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి తెలిపారు.
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా పని చేస్తున్న ఇరినా ఘోష్‌ను భారత్ ఎండీగా ప్రమోట్ చేసింది. ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న శశి శ్రీధరన్‌కు సంస్థలో మరింత ముఖ్యమైన బాధ్యతలు అప్పగించింది. ఏడబ్ల్యూఎస్ ఇండియా మాజీ అధిపతి పునీత్ చందోక్.. భవిష్యత్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరతారని సమాచారం. ఆయనను మైక్రోసాఫ్ట్ ఇండియా అధిపతిగా నియమిస్తారని తెలుస్తున్నది.
ఇక మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడిగా రాజీనామా చేసిన అనంత్ మహేశ్వరి.. 2016లో సంస్థలో చేరారు. అంతకు ముందు హానీ వెల్, మెకెన్సీ వంటి పలు సంస్థల్లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ పూర్వ విద్యార్థిగా అనంత్ మహేశ్వరి.. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో నిపుణులుగా ఉన్నారు. బిట్స్ పిలానీలో మాస్టర్ ఆఫ్ సైన్స్‌లో పట్టా అందుకున్నారు. ఐఐఎం-అహ్మదాబాద్ లోనూ విద్యాభ్యాసం చేశారు.