MG Motor | బ్రిటన్ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్.. వచ్చే ఏడాది తన కార్ల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. హెక్టర్, హెక్టర్ ప్లస్, ఆస్టర్, గ్లోస్టర్ ఎస్‌యూవీలతోపాటు కొమెట్ ఈవీ, జడ్ఎస్ ఈవీ కార్ల ధరలు కూడా పెరగనున్నాయి. గత ఆగస్టులో తన ఫ్లాగ్ షిప్ ఎస్యూవీ కార్లు హెక్టర్, గ్లోస్టర్ మోడల్స్ ధరలు గత ఆగస్టులో పెంచిన సంగతి తెలిసిందే.
కార్ల తయారీ ఖర్చులు పెరిగిపోవడంతో వాటి ధరలు పెంచక తప్పడం లేదని ఎంజీ మోటార్స్ తెలిపింది. ద్రవ్యోల్బణంతోపాటు కమొడిటీ ధరలు పెరగడంతో ధరలు పెంచక తప్పలేదన్న ఎంజీ మోటార్స్ దాని పూర్తి వివరాలను వెల్లడించలేదు. జనవరి నుంచి కార్ల ధరలు పెరుగనున్న నేపథ్యంలో ఇయర్ ఎండ్ ఆఫర్లు అందుబాటులోకి తెస్తామని తెలిపింది.
మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ యాజమాన్యాలు తమ కార్ల ధరలు పెరుగుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితోపాటు వచ్చే జనవరి నుంచి తమ కార్ల ధరలు పెంచడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు హ్యుండాయ్ మోటార్స్ ఇండియా కూడా తెలిపింది.
హెక్టర్, గ్లోస్టర్ ఎస్యూవీ కార్ల ధరలు మూడు నెలల్లోనే రెండోసారి, ఏడాదిలో మూడోసారి పెంచనున్నది. తాజా ధర పెంపుతో మోడల్, వేరియంట్‌ను బట్టి కార్ల ధరలు రూ.78 వేలు పెరుగుతాయి. దీని ప్రకారం హెక్టార్ రూ.15 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్ టాప్ హై ఎండ్ కార్లు రూ.22 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతాయని భావిస్తున్నారు.