Meta | ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ అయిన మెటా చిక్కుల్లోపడింది. ఐటీ దిగ్గజం అతిపెద్ద యాంటీ ట్రస్ట్ ట్రయల్స్‌ను ఎదుర్కోనున్నది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం నుంచి ట్రయల్స్ మొదలుకానున్నాయి. దాదాపు 37 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ మెటా కంపెనీకి ప్రశ్నలు సందించబోతున్నది. మార్కెట్లో గుత్తాధిపత్యం ఆరోపణలపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారించనున్నది. మెటా దిగ్గజం దశాబ్దం కిందట ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు ఆ కంపెనీకి అతిపెద్ద వ్యాపార స్తంభాలుగా నిలిచాయి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను విక్రయించాలంటూ కంపెనీపై ట్రేడ్ కమిషన్ ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
వాస్తవానికి పోటీలో లేకుండా తప్పించేందుకు దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ని మెటా కొనుగోలు చేసిందని.. సోషల్ మీడియాలో ఏకఛత్రాధిపత్యం కోసం మెటా కంపెనీ ప్రయత్నించినట్లుగా ట్రేడ్ కమిషన్ ఆరోపించింది. ఈ సందర్భంగా కొన్ని అంతర్గత మెయిల్స్‌ను కమిషన్ ప్రస్తావించింది. మెయిల్స్‌లో ‘పోటీ కంటే కొనుగోలు చేయడం ఉత్తమం’ అనేది మార్క్ జుకర్‌బర్గ్ వ్యూహమని.. ఈ విషయాన్ని మెయిల్లో ప్రస్తావించారని.. ఫేస్బుక్ తనకు ముప్పు కలిగించే కంపెనీలను కొనుగోలు చేసిందని.. ఈ ప్లాన్ కింద మొదట ఇన్స్టాగ్రామ్, ఆపై వాట్సాప్‌ను కొనుగోలు చేసినట్లుగా ఆరోపించింది. దీన్ని బట్టి వారి వ్యూహం ఏంటో అర్థమవుతుందని కమిషన్ అభిప్రాయపడింది.
న్యాయమూర్తి జేమ్స్ బోస్బర్గ్ నేతృత్వంలో ఈ విచారణ జరుగనుండగా.. మొదట పర్సనల్ సోషల్ నెట్వర్కింగ్ సేవల్లో మెటాకు గుత్తాధిపత్యం ఉందా? లేదా? అన్నది కమిషన్ తేల్చబోతున్నది. ఇదిలా ఉండగా.. కమిషన్ విచారణపై మెటా కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆయా యాప్స్‌లో తమ కంపెనీ పెట్టుబడులు పెట్టకపోతే వాటికి అంత ఆదరణ వచ్చేది కాదని తెలిపింది. ఈ విషయంలో కోర్టు తీర్పు మెటాకు వ్యతిరేకంగా వస్తే కమిషన్ నిర్ణయాలు కీలకం కానున్నాయి. దాంతో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ విక్రయించక తప్పని పరిస్థితి ఎదురుకావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మెటాకు భారీ ఎదురుదెబ్బగా మారుతుందని.. ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది.
కంపెనీకి వచ్చే ఆదాయంలో 50.5శాతం ఇన్‌స్టా నుంచి వస్తున్నట్లుగా అంచనా. ఇదిలా ఉండగా.. మెటా కంపెనీ 2012లో ఇన్‌స్టాగ్రామ్‌ని సుమారు ఒక బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్ కేవలం ఫొటో షేరింగ్ యాప్‌గా ఉండేది. ఆ తర్వాత సమూల మార్పులు చేస్తూ వచ్చింది. ఇక ఇన్‌స్టాని కొనుగోలు చేసిన రెండేళ్లకు అంటే.. 2014లో ఫేస్బుక్ వాట్సాప్‌ని 22 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, ప్రస్తుతం టిక్‌టాక్, స్నాప్‌చాట్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా మార్కెట్లో బడా ప్లేయర్స్ ఉన్నారని.. మెటా గుత్తాధిపత్యాన్ని నిరూపించడం ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు సవాలేనని నిపుణులు పేర్కొంటున్నారు. మెటాయే కాకుండా గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు సైతం ఇలాంటి యాంటీ ట్రస్ట్ కేసులను ఎదుర్కొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.