Mercedes-Benz EQS | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్.. భారత్ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ కార్ల ప్రాధాన్యం మరింత పెంచాలని భావిస్తున్నది. అందులో భాగంగా మెర్సిడెజ్ బెంజ్ తన మేబ్యాక్ ఈక్యూఎస్ ఎస్యూవీ కారును సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.2.25 కోట్ల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఈక్యూఎస్ సెడాన్, ఈక్యూఈ ఎస్యూవీ, ఈక్యూఏ, ఈక్యూబీ కార్లతో మెర్సిడెజ్ ఈక్యూఎస్ ఎస్యూవీ జత కలువనున్నది. ఈక్యూఈ, ఆల్ట్రా లగ్జరీయస్ మే బ్యాక్ ఈక్యూఎస్ మోడల్ కార్ల మధ్య ఈక్యూఎస్ ఎస్యూవీ నిలుస్తుందని భావిస్తున్నారు.
మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఎస్ ఎస్యూవీ కారులో లార్జ్ బ్లాక్ ప్యానెల్ గ్రిల్లె, యాంగ్యులర్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, హారిజోంటల్ ఎల్ఈడీ లైట్ బార్, ఏఎంజీ లైన్ ప్యాకేజీ, ఉంటాయి. ఇంటీరియర్‌గా ఈక్యూఎస్ ఎస్యూవీ కారు సిగ్నేచర్ హైపర్ స్క్రీన్, డాష్ బోర్డు పొడవునా మాసివ్ కర్వ్డ్ డిస్ ప్లే, 12.3 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 17.7 అంగుళాల సెంట్రల్ స్క్రీన్ ఫర్ ఇన్ఫోటైన్మెంట్, 12.3 అంగుళాల ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్ ఉంటాయి.
ఈజీ నేవిగేషన్ కోసం ఆప్షనల్‌గా ఆగ్యుమెంటెడ్ రియాల్టీ హెడ్ అప్ డిస్ ప్లే ఆఫర్ చేస్తోంది. మే బ్యాక్ ఈక్యూఎస్ కారు నాలుగు లేదా ఐదు సీట్ల ఫార్మాట్లలో వస్తుంది. స్టాండర్డ్ ఈక్యూఎస్ ఎస్యూవీ కారు ఆప్షనల్‌గా ఏడు సీట్ల ఫార్మాట్లోనూ సొంతం చేసుకోవచ్చు. నూతన మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఎస్ ఎస్యూవీ కారు 580 4-మ్యాటిక్ ఎడిషన్ తో వస్తోంది. డ్యుయల్ మోటార్ డ్రైవ్ ట్రైన్ (గరిష్టంగా 543 బీహెచ్పీ విద్యుత్, 858 ఎన్ఎం టార్క్) ఆప్షన్ తో వస్తున్నది. 108.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ గల ఈక్యూఎస్ ఎస్ యూవీ కారు సింగిల్ చార్జింగ్ తో 609 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఎస్ కారు ధర రూ.1.80 కోట్లు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు. మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఎస్ సెడాన్ కారు రూ.1.62 కోట్ల కంటే రూ.18 లక్షలు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. బీఎండబ్ల్యూ ఐఎక్స్, ఆడీ ఈట్రాన్ ఎస్ యూవీ కార్లకు మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఎస్ ఎస్యూవీ కారు పోటీ పడుతుందని తెలుస్తోంది.