న్యూఢిల్లీ, జూలై 22: మేఘా-బీవైడీ ఈవీ ప్లాంట్ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. తెలంగాణకు చెందిన మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్), చైనా ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ దిగ్గజం బీవైడీ మోటర్స్ కలిసి రాష్ట్రంలో రూ.8,000 కోట్లకుపైగా పెట్టుబడి (1 బిలియన్ డాలర్లు)తో ఓ కార్ల తయారీ ప్లాంట్‌ను పెట్టాలనుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ జాయింట్ వెంచర్.. కేంద్రాన్ని అనుమతి కోరింది. కాగా, భారత్‌లో చైనా పెట్టుబడులపట్ల ఉన్న భద్రతాపరమైన కారణాలతోనే ఈ ప్రాజెక్టుకు నో చెప్పినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇక అంతర్గత వాణిజ్య, పారిశ్రామిక ప్రగతి శాఖ (డీపీఐఐటీ)కు సమర్పించిన వివరాల ప్రకారం ఏటా 15 వేల ఎలక్ట్రిక్ కార్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను మేఘా, బీవైడీ కంపెనీలు తేవాలని భావించాయి. ఈ యూనిట్‌కు ఆర్థికంగా మేఘా, సాంకేతికంగా బీవైడీ దన్నుగా ఉండాలనుకున్నాయి. ఇదిలావుంటే ఇప్పటికే ఒలెక్ట్రా బ్రాండ్ పేరుతో విద్యుత్తు ఆధారిత బస్సులను మేఘా అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తయారు చేస్తున్న సంగతి విదితమే. ఈ ఎలక్ట్రిక్ బస్సులకూ బీవైడీ నుంచే టెక్నాలజీ మద్దతు అందుతున్నది.