హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ బిజినెస్): దేశంలో అతిపెద్ద రిటైల్ ఫార్మసీ, డయాగ్నోస్టిక్స్ సేవల సంస్థల్లో ఒకటైన మెడ్‌ప్లస్..ఎంపిక చేసిన ఔషధాలపై 80 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం తన సొంత బ్రాండ్‌తో 500 రకాల ఔషధాలను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో జీ మధుకర్ రెడ్డి తెలిపారు. రాయితీ ఇస్తున్న ఔషధాల్లో థెరపిటిక్, క్రానిక్ మెడిసిన్స్ ఉన్నాయని ఆయన చెప్పారు.
అధిక నాణ్యత కలిగిన, పెటెంట్ లేని ఔషధాలను ఉత్పత్తి చేసేందుకుగాను సంస్థ పలు ఔషధ తయారీ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు, తద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకు అందించడంలో భాగంగా ఈ ఔషధాలను అత్యంత సరసమైన ధరల్లో అందిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి 500 ఔషధాలపై రాయితీ ఇస్తుండగా..వచ్చే మూడు నెలలో ఈ సంఖ్యను 800కి పెంచుకోనున్నట్టు తెలిపారు. రాయితీ ఇస్తున్న వాటిలో రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల వ్యాధులను నియంత్రించే ఔషధాలు ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 800 నుంచి 1,000 ఫార్మాసీలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1,054 ఫార్మాసీలను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 3,834కి చేరుకున్నది. వచ్చే మార్చి నాటికి ఈ ఔట్లెట్ల సంఖ్య 4,500కి చేరుకోనున్నదన్నారు. ఇందుకోసం వందల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.4,558 కోట్ల టర్నోవర్ నమోదుకాగా, ఈ ఏడాది 25 శాతం వృద్ధిని నమోదుకావచ్చునని ఆయన అంచనా వేస్తున్నారు.