Reliance & TCS | గత వారం స్టాక్‌మార్కెట్లలో ట్రేడింగ్ చేసిన ఇన్వెస్టర్ల పంట పండింది. గతవారం స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగులు తీసింది. దీంతో ఆయా సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా జూమ్.. జూమ్మంటూ పైపైకి దూసుకెళ్లింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మినహా టాప్-10 బ్లూ చిప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.98 లక్షల కోట్లు పెరిగింది. రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు భారీగా లాభపడ్డాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 2311.45 పాయింట్ల (4.29 శాతం) లాభంతో స్థిర పడింది.
ఎల్ఐసీ మినహా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర 9- స్క్రిప్ట్‌ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,98,523.81 కోట్లు పెరిగింది.
శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.68,564.65 కోట్లు పెరిగి రూ.16,93,245.73 కోట్ల వద్ద స్థిర పడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.64,929.87 కోట్ల వృద్ధితో రూ.11,60,285.19 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ. 34,028.7 కోట్లు పెరిగి, రూ. 5,56,526.81 కోట్ల వద్ద ముగిసింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,893.77 కోట్లు పుంజుకుని రూ.6,33,793.91 కోట్లకు పెరిగింది. భారతీయ స్టేట్ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.30,968.4 కోట్లు పెరిగి రూ.4,58,457.30 కోట్ల వద్ద స్థిర పడింది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,636.69 కోట్ల లబ్ధితో రూ.3,78,774.69 కోట్లకు చేరింది. హిందూస్థాన్ యూనీలివర్ ఎం-క్యాప్ రూ.16,811.32 కోట్లు పెరిగి రూ.6,20,362.58 కోట్ల వద్ద నిలిచింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,110.37 కోట్ల పురోగతితో రూ.7,73,770.09 కోట్ల వద్ద ముగిసింది. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,579.24 కోట్ల వృద్ధితో రూ.4,16,701.23 కోట్ల వద్ద నిలిచింది. మరోవైపు ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ.12,396.99 కోట్లు నష్టపోయి రూ.4,35,760.72 కోట్లతో సరి పెట్టుకుంది.
టాప్-10 స్క్రిప్ట్‌ల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్, ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి.