Market Capitalisation | గతవారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.28 లక్షల కోట్లు జత కలిసింది. బ్లూ చిప్ సంస్థలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ భారీగా లబ్ధి పొందాయి. వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,28,116.58 కోట్లు పెరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మాత్రమే నష్టాలతో ముగిశాయి.
గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 2732.05 పాయింట్లు (3.69 శాతం) లబ్ధి పొందింది. 30-షేర్ బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్లో 1720.8 పాయింట్లు (2.29 శాతం) పెరిగి 76,795.31 పాయింట్ల నూతన రికార్డు నమోదు చేసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 1618.85 పాయింట్లు (2.16శాతం) లాభంతో 76,693.36 పాయింట్ల వద్ద ముగిసింది.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.80,828.08 కోట్లు వృద్ధి చెంది రూ.14,08,485.29 కోట్లకు చేరుకున్నది. హిందూస్థాన్ యూనీ లివర్ ఎం-క్యాప్ రూ.58,258.11 కోట్లు పెరిగి రూ.6,07,407.43 కోట్ల వద్ద స్థిర పడింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.54,024.35 కోట్ల లాభంతో రూ.19,88,741.47 కోట్ల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.52,770.59 కోట్ల లబ్ధితో రూ.6,36,630.87 కోట్ల వద్ద నిలిచింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.32,241.67 కోట్లు పుంజుకుని రూ.11,96,325.52 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.32,080.61 కోట్ల వృద్ధితో 8,10,416.01 కోట్ల వద్ద నిలిచింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.16,167.71 కోట్ల లాభంతో రూ.5,48,204.12 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.1,745.46 కోట్ల వృద్ధితో రూ.7,88,975.17 కోట్లకు చేరుకున్నది.