Maruti Suzuki Wagon R | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరో మైలురాయిని చేరుకున్నది. మారుతి సుజుకి కార్లలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ ‘వ్యాగన్-ఆర్’ మంగళవారం 30 లక్షల కార్లు విక్రయించిన వేరియంట్ గా నిలిచింది. 1999లో తొలిసారి వ్యాగన్-ఆర్ కారును ఆవిష్కరించింది. నాటి నుంచి కాలనుగుణంగా సమూల మార్పులు జరిగినా.. ఇప్పటికీ టాల్ బాయ్ బాక్సీ డిజైన్ కొనసాగుతున్నది.
మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ ప్రస్తుతం రూ.5.54 లక్షల నుంచి రూ.7.42 లక్షల మధ్య ధర పలుకుతున్నది. రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బేస్ స్పెషల్ 1.0 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ 66 బీహెచ్పీ విద్యుత్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ 88 బీహెచ్పీ విద్యుత్ వెలువరిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తుంది. బయో ఫ్యుయల్ సీఎన్జీ వర్షన్ కూడా అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ‘భారత్లో మోస్ట్ ఐకానిక్ హ్యాచ్ బ్యాక్ కారుగా వ్యాగన్-ఆర్ నిలిచింది. 30 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైన వేరియంట్ గా వ్యాగన్-ఆర్ విజయయాత్ర కొనసాగుతున్నది. మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు, చేర్పులతో, డిజైన్, పనితీరులో మార్పులతో పైపైకి దూసుకెళ్తున్నది’ అని అభిప్రాయ పడ్డారు.