Maruti Suzuki Swift CNG | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన స్విఫ్ట్ సీఎన్జీ కారును గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.8.19 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. దీంతో మారుతి సుజుకి 14 మోడల్ కార్లను సీఎన్జీ వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకొచ్చినట్లయింది. నాలుగు నెలల క్రితం గత మే నెలలో మారుతి సుజుకి తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్-2024 పెట్రోల్ వేరియంట్ కారును ఆవిష్కరించింది.
న్యూ మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ కారు 1.2 లీటర్ల జడ్-సిరీస్ డ్యుయల్ వీవీటీ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 69.75 పీఎస్, 101.8 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది. పాత స్విఫ్ట్ సీఎన్జీ వేరియంట్ ఇంజిన్ గరిష్టంగా 77.6 పీఎస్ విద్యుత్, 98.5 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. పాత స్విఫ్ట్ కంటే కొత్త స్విప్ట్ -2024 కారు మైలేజీలో ఆరు శాతం బెటర్ అని మారుతి సుజుకి తెలిపింది. పాత స్విఫ్ట్ సీఎన్జీ కారు కిలో సీఎన్జీపై 32.85 కి.మీ మైలేజీ అందిస్తుంది.
మారుతి సుజుకి పాత స్విఫ్ట్ సీఎన్జీ కారు వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ వేరియంట్లలో లభిస్తుంది. కొత్త స్విఫ్ట్-2024 వర్షన్ అదనంగా వీఎక్స్ఐ (ఓ) వేరియంట్‌గా వస్తుంది. పెట్రోల్ వేరియంట్ కంటే రూ.90 వేలు ఎక్కువ ధర పలుకుతుంది.
స్విఫ్ట్ వీఎక్స్ఐ సీఎన్జీ – రూ.8.19 లక్షలు.
స్విఫ్ట్ వీఎక్స్ఐ (ఓ) సీఎన్జీ – రూ.8.46 లక్షలు.
స్విఫ్ట్ జడ్ఎక్స్ఐ సీఎన్జీ – రూ.9.19 లక్షలు.
మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ కారు 7-అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ఇన్ ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ చార్జర్, సుజుకి కనెక్ట్ సూట్, రేర్ ఏసీ వెంట్స్, 60:40 స్ప్లిట్ రేర్ సీట్స్, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ + (ఈఎస్పీ), హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఫెస్టివ్ సీజన్ డిమాండ్ ఎక్కువ ఉన్నందున తొలుత గుజరాత్ లో అందుబాటులో ఉంటుంది.