Stock Markets | అంతర్జాతీయ బలహీనతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉక్రెయిన్‌పై రష్యా బాంబు దాడులు, అమెరికా ఫెడ్ రిజర్వు భవిష్యత్‌లో మళ్లీ వడ్డీరేట్లు పెంచుతుందన్న ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. విదేశీ ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించుకోవడంతో అమెరికా డాలర్‌పై రూపాయి మరో ఆల్‌టైం కనిష్ఠ స్థాయి నమోదు చేసింది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 800 పాయింట్లకు పైగా పతనమై ముగింపు దశలో 200.18 పాయింట్ల పతనంతో 57,991.11 పాయింట్లతో సరిపెట్టుకున్నది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 73.65 పాయింట్ల నష్టంతో 17,241 పాయింట్ల వద్ద స్థిర పడింది.
బీఎస్ఈ-30లో ఏషియన్ పెయింట్స్ 1.99 శాతం నష్టపోగా, టైటాన్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, నెస్ట్లే ఇండియా నష్టపోయిన స్టాక్స్‌లో ఉన్నాయి. తద్భిన్నంగా యాక్సిస్ బ్యాంక్ 2.76 శాతం లాభంతో ముగిసింది. రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ స్క్రిప్ట్ 1.84 శాతం పుంజుకున్నది. ఇంకా మారుతి సుజుకి, విప్రో, ఇన్పోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ స్టాక్స్ లాభ పడ్డాయి. బీఎస్ఈ-30లో 19 షేర్లు నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.87 శాతం, స్మాల్ క్యాప్ 0.58 శాతం నష్టపోయాయి. కన్జూమర్ డ్యూరబుల్స్ 1.43 శాతం, పవర్ 1.30, యుటిలిటీస్ 1.12 శాతం, ఎఫ్ఎంసీజీ 1.01, రియాల్టీ 0.98 నష్టపోయాయి. ఐటీ అండ్ టెక్ ఇండెక్స్‌లు లాభాలతో స్థిర పడ్డాయి.