SEBI | న్యూఢిల్లీ, అక్టోబర్ 1: అడ్డూ.. అదుపు లేకుండా దూసుకుపోతున్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్‌కు మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. స్పీడ్ బ్రేకర్లను పెట్టింది. మంగళవారం ఈ మేరకు నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్త విధివిధానాలను ప్రకటించింది. దశలవారీగా నవంబర్ 20 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. మదుపరుల ప్రయోజనాల రక్షణార్థం, మార్కెట్ స్థిరత్వాన్ని మెరుగుపర్చడానికి చర్యలు తీసుకున్నట్టు సెబీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే వీక్లీ బేసిస్‌కు ఎక్స్‌పైరీలను తగ్గించడం, ప్రతీ ఎక్సేంజ్‌కు తమ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ల్లో వీక్లీ ఎక్స్‌పైరీతో ఉన్న ఒకదానికి మాత్రమే డెరివేటివ్ కాంట్రాక్టులను అనుమతించడం వంటి కీలక నిర్ణయాలను సెబీ ఆచరణలో పెట్టబోతున్నది.
రూ.15 లక్షలకు..: మార్కెట్లో పరిచయమవుతున్నప్పుడు డెరివేటివ్‌లలో మినిమం ట్రేడింగ్ విలువను రూ.15 లక్షలకు పెంచాలని సెబీ నిర్ణయించింది. ఆ తర్వాత రూ.20 లక్షలకు పెరగనున్నది. ప్రస్తుతం ఇది రూ.5-10 లక్షలుగానే ఉండటం గమనార్హం. ‘వీక్లీ ఎక్స్పైరీలతో ఇండెక్స్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ను పెట్టడం, కాంట్రాక్ట్ పరిమాణాలను పెంచడంతో ట్రేడర్లను ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్‌కు దూరం చేయవచ్చునని సెబీ భావిస్తున్నది’ అంటూ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎందుకీ చర్యలు?: ఎఫ్అండ్వోల్లో ట్రేడింగ్ చేస్తున్న దాదాపు 90 శాతం మందికి నష్టాలే వాటిల్లుతున్నాయి. అయినప్పటికీ ఏటేటా వీరి సంఖ్య పెరుగుతూనే ఉండటం ఆందోళనకరంగా మారింది. స్టాక్స్‌ను కొనడం, వాటిని అలాగే ఉంచుకోవడానికి బదులుగా ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్స్ల్లో డెడ్‌లైన్ ఉంటుంది. ఆ గడువులోగా మన అంచనాలు తప్పితే పెట్టిన పెట్టుబడులు పోయినట్టే. దీంతో దీనికి ట్రేడర్లు దూరంగా ఉండేలా నిబంధనల్ని సెబీ కఠినతరం చేస్తున్నది.