న్యూఢిల్లీ, ఆగస్టు 23: ప్రముఖ వ్యాపార-పారిశ్రామికవేత్త, రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఆర్అడాగ్) అధినేత అనిల్ అంబానీపై మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ కొరడా ఝుళిపించింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగాగానీ దేశీయ స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఐదేండ్లపాటు నిషేధించింది. అలాగే మార్కెట్ నమోదిత లేదా సెబీలో రిజిస్టరైన సంస్థల్లో డైరెక్టర్గాగానీ, ఇతర కీలకమైన పదవుల్లో మరే రకమైన హోదాల్లో ఉండకుండా గురువారం ఆంక్షలు విధించినట్టు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అంతేగాక రూ.25 కోట్ల జరిమానా కూడా వేస్తున్నట్టు సెబీ ప్రకటించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్) నిధుల దుర్వినియోగమే కారణమని 222 పేజీల ఆదేశాల్లో సెబీ పేర్కొన్నది. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారి అనిల్ అంబానీయేనని వెల్లడించింది. ఇక ఆర్హెచ్ఎఫ్ఎల్నూ సెక్యూరిటీ మార్కెట్ లావాదేవీల నుంచి 6 నెలలపాటు తొలగించింది. రూ.6 లక్షల ఫైన్ కూడా వేస్తున్నట్టు స్పష్టం చేసింది.
రిలయన్స్ హెచ్ఎఫ్ఎల్లో నిధుల దుర్వినియోగం/మళ్లింపులపై అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సెబీ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే అన్ని ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. నిబంధనల ఉల్లంఘనలేవైనా జరిగాయా? అన్న కోణంలో విచారణ జరిపింది. ఈ క్రమంలోనే ఆర్హెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్లు, అందులో ఇతర కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారి అండతో అనిల్ అంబానీ అక్రమాలకు పాల్పడినట్టు సెబీ గుర్తించింది. అమిత్ బాప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేశ్ ఆర్ షాలతో కుమ్మక్కై అనిల్ అంబానీ కంపెనీ నిధులను దారి మళ్లించినట్టు తేలింది. వీరందరిపైనా ఐదేండ్ల నిషేధం పడింది. కాగా, అనిల్ అంబానీకి చెందిన సంస్థలకు రుణాలిస్తున్నట్టు ఈ నిధుల గోల్మాల్ జరిగింది. అయితే ఈ అవకతవకలపై ఆర్హెచ్ఎఫ్ఎల్ బోర్డులోని ఇతర డైరెక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కార్పొరేట్ రుణాలపై సమీక్ష జరుపాలని పట్టుబట్టారు. అయినప్పటికీ యాజమాన్యం దాన్ని పట్టించుకోలేదని తేలింది.
ఈ మొత్తం వ్యవహారంతో సంబంధమున్న మరో 24 మందిపైనా సెబీ కఠిన చర్యలు తీసుకున్నది. రూ.21 కోట్ల నుంచి రూ.27 కోట్ల మేర జరిమానాలు వేసింది. ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి అక్రమంగా రుణాలు అందుకున్న అనిల్ అంబానీ సంస్థలపైనా వేటు పడింది. సంస్థ ప్రయోజనాలను తాకట్టుపెట్టి ప్రమోటర్తో మేనేజ్మెంట్ చేతులు కలిపిందని సెబీ ఈ సందర్భంగా ఆక్షేపించింది. ఆస్తులు, ఆదాయం, విలువ అసలు ఏ అర్హత లేకపోయినా వందలాది కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశారని మండిపడింది. అందువల్లే రుణాలు వసూలవక ఆర్హెచ్ఎఫ్ఎల్ దివాలా తీసిందని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆర్హెచ్ఎఫ్ఎల్ రుణగ్రహీతలపై సెబీ దృష్టి సారిస్తున్నదిప్పుడు. రుణాలు పొందినవారంతా అనిల్ అంబానీకి చెందినవారేనా? అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నది.