ముంబై, ఆగస్టు 17: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గోరోజూ లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ దాదాపు నాలుగున్నర నెలల తర్వాత మరోసారి 60 వేల స్థాయికి చేరింది. బుధవారం 417.92 పాయింట్లు లేదా 0.7 శాతం ఎగిసి 60,260.13 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 119 పాయింట్లు లేదా 0.67 శాతం అందుకుని 18 వేలకు చేరువలో 17,944.25 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ సంస్థల్లో బజాజ్ ఫిన్సర్వ్ షేర్ విలువ అత్యధికంగా 5.74 శాతం ఎగబాకింది. బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, హెచ్‌యూఎల్, విప్రో తదితర షేర్లూ పుంజుకున్నాయి. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, టాటా స్టీల్, కొటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, టైటాన్ షేర్లు 1.07 శాతం వరకు నష్టపోయాయి. రంగాలవారీగా టెలికం, టెక్నాలజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, ఫైనాన్స్ షేర్లు 1.8 శాతం నుంచి 0.9 శాతం వరకు పెరిగాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు నిరాశపర్చాయి. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.64 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.53 శాతం ఎగిశాయి. ఆసియా దేశాల్లో జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభపడగా, దక్షిణ కొరియా సూచీ నష్టపోయింది. ఐరోపా ప్రధాన దేశాల మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి.
రూపాయి ఆకర్షణీయం
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బుధవారం 29 పైసలు బలపడింది. దీంతో 79.45 వద్ద నిలిచింది. 79.32 వద్ద ట్రేడింగ్ ప్రారంభమవగా, ఒకానొక దశలో 79.26 స్థాయికి పుంజుకున్నది. అలాగే 79.48 స్థాయికీ పడిపోయింది. చివరకు 79.45 వద్ద స్థిరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరుల కొనుగోళ్ల జోరు, స్థిరంగా కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు రూపాయికి కలిసొస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో తగ్గుతున్న ముడి చమురు ధరలు.. దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని శాంతింపజేస్తాయన్న అంచనాలూ మార్కెట్‌కు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెడుతున్నాయి.
రూ.7.41 లక్షల కోట్లపైనే
స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో పరుగులు పెడుతున్న నేపథ్యంలో మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో పెరుగుతూపోతున్నది. గడిచిన నాలుగు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈలోని సంస్థల మార్కెట్ విలువ రూ.7.41 లక్షల కోట్లపైనే ఎగబాకింది. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,442.84 పాయింట్లు లేదా 2.45 శాతం పుంజుకున్నది. దీంతో బీఎస్ఈలో నమోదైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.7,41,534.44 కోట్లు ఎగిసి రూ.2,79,85,821.38 కోట్లకు చేరింది.
లాభాలకు కారణాలివే..
సెన్సెక్స్ కదలికలు