Investers Wealth | ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు పతనం, విదేశీ ఇన్వెస్టర్ల వాటాల విక్రయంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరి సెంటిమెంట్ బలహీన పడింది. తత్ఫలితంగా శుక్రవారం ఒక్కరోజే స్టాక్ మార్కెట్ల క్రాష్ ప్రభావంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6.80 లక్షల కోట్లు హరించుకుపోయింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 662.87 పాయింట్ల పతనంతో 79,402.29 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో బీఎస్ఈ సెన్సెక్స్ ఒకానొక దశలో 927.18 పాయింట్లు కోల్పోయి 79,137.98 పాయింట్లకు చేరుకుంది.
ఈక్విటీ మార్కెట్లలో బలహీన ధోరణులతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,80,383.26 కోట్ల నష్టంతో రూ.4,36,98,921.66 కోట్ల (5.20 లక్షల కోట్ల డాలర్లు) కు చేరుకున్నది. వివిధ కారణాలతో భారత్ ఈక్విటీ మార్కెట్లలో సర్దుబాట్లతో ఆయా సంస్థల షేర్లు పతనం అయ్యాయి. చైనా కంపెనీలు ఆకర్షణీయంగా మారడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రత్యేకించి బీఎస్ఈ-30 ఇండెక్సు లో ఇండస్ఇండ్ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభం 40 శాతం తగ్గడంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా ఆ బ్యాంకు షేర్ 18.56 శాతం నష్టపోయింది. మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ అండ్ టర్బో, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. యాక్సిస్ బ్యాంకు, హిందూస్థాన్ యూనీ లివర్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభ పడ్డాయి.