న్యూఢిల్లీ, నవంబర్ 28: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (రీట్స్)ను ఈక్విటీ సంబంధిత సాధనాలుగా శుక్రవారం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పునఃవర్గీకరించింది. వచ్చే ఏడాది మొదలు ఈ మార్పు అమల్లోకి రానున్నది. మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్), స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఎస్‌ఐఎఫ్‌లు) ద్వారా మరింత ఎక్కువమంది రీట్స్ పెట్టుబడుల్లో భాగం కావాలన్న లక్ష్యమే సెబీ నిర్ణయం వెనుక కనిపిస్తున్నది. అయినప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్) మాత్రం హైబ్రిడ్ సాధనాలుగానే కొనసాగనున్నాయి. ‘జనవరి 1, 2026 నుంచి మ్యూచువల్ ఫండ్స్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ద్వారా రీట్స్‌లోకి వెళ్లే పెట్టుబడులు.. ఈక్విటీ సంబంధిత సాధనాల్లోకి వచ్చిన పెట్టుబడులుగానే పరిగణిస్తారు’ అని ఓ తాజా సర్క్యులర్‌లో సెబీ పేర్కొన్నది.
కాగా, డిసెంబర్ 31దాకా డెట్ స్కీములు, ఎస్ఐఎఫ్ వ్యూహాల ద్వారా వచ్చే రీట్ పెట్టుబడులకు జనవరి 1 నుంచి వచ్చే మార్పు నుంచి మినహాయింపు ఉండనున్నది. ఈ పెట్టుబడులను ప్రస్తుత నిబంధనల ప్రకారమే చూస్తామని సెబీ వెల్లడించింది. అయితే ఏఎంసీలు మార్కెట్ పరిస్థితులనుబట్టి, మదుపరుల ప్రయోజనాల ఆధారంగా క్రమేణా ఆ పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చు. ఈ మేరకు అప్డేట్ అయిన స్క్రిప్ వర్గీకరణ జాబితాను మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ యాంఫీ తమ భాగస్వాములందరికీ తెలియజేయనున్నది. ఇక వచ్చే ఏడాది జూలై 1 నుంచి ఈక్విటీ సూచీలకు రీట్స్ కూడా తోడవనున్నాయన్న సంగతి విదితమే.
అన్ని రెగ్యులేటెడ్ సంస్థలు, వారి ఏజెంట్లు తమతమ సామాజిక మాధ్యమాల్లోని హోమ్ పేజీపై నమోదిత పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్లను తప్పకుండా ప్రముఖంగా చూపాలని సెబీ స్పష్టం చేసింది. కొన్ని అక్రమాలకు దారితీస్తుండటంతోనే ఈ మేరకు ఆయా సంస్థలకు సూచించింది. సోషల్ మీడియాపై వచ్చే సమాచారం సెబీ రెగ్యులేటెడ్ వ్యక్తులదా? లేక అన్‌రిజిస్టర్డ్ వ్యక్తులదా? అని తెలుసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించే సెబీ ఈ ప్రతిపాదనల్ని చేసినట్టు చెప్తున్నారు. ఇన్వెస్టర్లు తప్పుదోవపట్టకుండా కూడా ఇది పనికొస్తుందని సెబీ భావిస్తున్నది. ఇక మదుపరుల ప్రయోజనాలకు పెద్దపీట వేయడంలో రాజీపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా సెబీ తెలిపింది.
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ప్రొసీడింగ్స్ దుర్వినియోగం, మోసపూరిత కార్పొరేట్ ప్రకటనలకుగాను డ్రోన్‌ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్ (డీఏఐఎల్), దాని ప్రమోటర్లు, మరికొందరిని సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి రెండేండ్లదాకా సెబీ నిషేధించింది. అంతేగాకుండా రూ.75 లక్షలదాకా జరిమానాలనూ విధించింది. కంపెనీ ప్రమోటర్లుగానేగాక, ఎండీగా ఉన్న ప్రతీక్ శ్రీవాత్సవ, సీఎఫ్‌వోగా ఉన్న నిఖితా శ్రీవాత్సవపై రూ.20 లక్షల చొప్పున ఫైన్ పడింది. ఇక డీఏఐఎల్తోపాటు , ఇన్స్టాఫిన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎల్ఎల్పీ, సందీప్ ఘాటేలపై రూ.10 లక్షల చొప్పున జరిమానా వేసింది. మరో రూ.5 లక్షల ఫైన్ మైక్రో ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సెబీ విధించింది. 2022 డిసెంబర్ 23న బీఎస్ఈ ఎస్ఎంఈ వేదికపై డీఏఐఎల్ ఈక్విటీ షేర్లు నమోదయ్యాయి. ఐపీవో ద్వారా రూ.33.96 కోట్లను ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ సమీకరించింది. అయితే మదుపరులు షేర్లను కొనేందుకు తప్పుడు ప్రకటనలు ఇచ్చారని, తద్వారా లేని డిమాండ్‌ను సృష్టించారని సెబీ అంటున్నది.