న్యూఢిల్లీ, నవంబర్ 17: కార్వీ గ్రూప్ మాజీ అధికారుల బ్యాంక్, డీమ్యాట్ ఖాతాల జప్తునకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆదేశించింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) కుంభకోణంలో దుర్వినియోగమైన క్లయింట్ల సొమ్ము రికవరీలో భాగంగా సుమారు రూ.1.8 కోట్ల (వడ్డీ, అన్నిరకాల వ్యయాలు, చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి) కోసం ముగ్గురు మాజీ ఉన్నతోద్యోగుల ఖాతాల జప్తునకు సెబీ ఈ ఆదేశాలు జారీ చేసింది.
కేఎస్‌బీఎల్ ఫైనాన్స్, అకౌంట్స్ విభాగం మాజీ ఉపాధ్యక్షుడు కృష్ణహరి జీ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్ మాజీ జనరల్ మేనేజర్ శ్రీనివాస రాజు, మాజీ కాంప్లియెన్స్ అధికారి శ్రీకృష్ణ గురజాడలకు చెందిన బ్యాంక్, డీమ్యాట్ ఖాతాల అటాచ్‌మెంట్‌కు సెబీ నిర్ణయం తీసుకున్నది. ఇందులోభాగంగానే వీరికి చెందిన ఖాతాల నుంచి ఏ రకమైన డెబిట్స్కు అనుమతులివ్వరాదని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యూచువల్ ఫండ్స్‌కు సెబీ స్పష్టం చేసింది.
ఈ మేరకు మంగళవారమే నోటీసులు వెళ్లాయి. అయితే ఆయా ఖాతాల్లో ఎవరైనా జమచేస్తే మాత్రం అంగీకరించాలన్నది. ఇక లాకర్లుసహా వీరికి చెందిన అన్ని ఖాతాలను అటాచ్ చేయాలని కూడా బ్యాంకులన్నిటికీ సెబీ సూచించింది. గత నెల ఈ ముగ్గురికి దాదాపు రూ.1.8 కోట్ల కోసం సెబీ డిమాండ్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో కృష్ణహరిపై కోటి రూపాయలు, రాజుపై రూ.40 లక్షలు, శ్రీకృష్ణపై రూ.30 లక్షలు చొప్పున సెబీ ఫైన్ వేసిన సంగతి విదితమే.