న్యూఢిల్లీ, మే 16: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు చెందిన పెట్టుబడిదారులు వచ్చే నెల 2 లోగా తమ క్లెయిమ్‌లను దాఖలు చేయాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సూచించింది. నవంబర్ 23, 2020న కార్వీ స్టాక్ బ్రోకింగ్‌ను నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కార్వీలో పెట్టుబడులు పెట్టిన వారు తమ పెట్టుబడులకు సంబంధించి క్లెయిమ్‌ల చివరి తేదీ జూన్ 2గా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సెబీ ఒక ప్రకటనను విడుదల చేసింది. పెట్టుబడిదారులు టోల్-ఫ్రీ నంబర్ 1800 2660050 లేదా defaultisc@nse. co.in కి ఈ-మెయిల్ చేయాలని సూచించింది.
క్లయింట్లకు సంబంధించి పెట్టుబడులను దుర్వినియోగం చేసిన కేసులో కేఎస్‌బీఎల్, కంపెనీ సీఎండీ సీ పార్థసారథిపై ఏడేండ్లపాటు నిషేధం విధించడంతోపాటు రూ.21 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. కేఎస్‌బీఎల్‌కు సంబంధించిన ఆస్తులను జప్తు చేసి, విక్రయించడంతో వచ్చిన నిధులను పెట్టుబడిదారులకు పంచనున్నది. కేఎస్‌బీఎల్ సంస్థ ప్రమోటర్లు తమకు నచ్చినట్టు వ్యవహరించారని, ముఖ్యంగా క్లయింట్ల సెక్యూరిటీలను తాకట్టుపెట్టి పలు సంస్థల వద్ద రుణాలు తీసుకున్నారని, వీటిపై క్లయింట్లకు తెలియనీయకుండా వ్యవహరించారని సెబీ ఆరోపించింది.