Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం లాభాల్లో కదలాడాయి. మదుపరులలో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. దీంతో ఓవరాల్‌గా క్రిందటి వారం మార్కెట్లు లాభాలనే సంతరించుకున్నాయి. ఫలితంగా అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 649.37 పాయింట్లు ఎగిసి 81,086.21 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 282 పాయింట్లు ఎగబాకి 24,823.15 దగ్గర నిలిచింది. అయితే సూచీలు వరుస లాభాల్లో, పైగా ఆల్‌టైమ్ హై దరిదాపుల్లో ఉన్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది.
సెల్లింగ్ ప్రెషర్ లేదా లాభాల స్వీకరణకు ఆస్కారం ఉందని మెజారిటీ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుంటే ఈ వారం ఒడిదొడుకులకు అవకాశం కనిపిస్తున్నదంటున్నారు. వివిధ పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. కాగా, అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 24,600 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,300 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 25,100-25,300 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
చివరగా..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. ట్రేడింగ్‌ను అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.