Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఇటీవల మార్కెట్లు పతనమయ్యాయి. విదేశీ పెట్టుబడులతో మదుపరుల కాన్ఫిడెన్స్ పెరగడంతో మార్కెట్లు వారంలో తొలిరోజు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఉదయం మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలైనా ఆ తర్వాత లాభాల్లో కొనసాగాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 79,885.36 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఇంట్రాడేలో 79,772.46 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. అత్యధికంగా 80,636.05 పాయింట్లకు చేరింది. చివరకు 746.29 పాయింట్ల లాభంతో 80,604.08 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 221.75 పాయింట్లు పెరిగి 24,585.05 వద్ద ముగిసింది. దాదాపు 2,136 షేర్లు లాభపడగా.. 1,867 షేర్లు నష్టపోయాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా మోటార్స్, ఎటర్నల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్స్, ట్రెంట్, ఎస్బీఐ, జియో ఫైనాన్షియల్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాల్లో కొనసాగగా.. హీరో మోటోకార్ప్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారతి ఎయిర్టెల్ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.35 శాతం పెరిగాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా, మిగతా అన్ని రంగాల సూచీలు ఫార్మా, మెటల్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ 0.5-2 శాతం పెరిగాయి.