ముంబై, అక్టోబర్ 4: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. విదేశీ నిధులు తరలిపోతుంటడం, అమెరికా, ఆసియా మార్కెట్ల బలహీనంగా ట్రేడవడం సూచీల నష్టాలకు ప్రధాన కారణం. ఇంట్రాడేలో 633 పాయింట్లు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 286 పాయింట్లు కోల్పోయి 65,226 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 92.65 పాయింట్లు కోల్పోయి 19,436.10 వద్ద స్థిరపడింది.
మార్కెట్లో యాక్సిస్ బ్యాంక్ షేరు టాప్ లూజర్‌గా నిలిచింది. బ్యాంక్ షేరు ధర 4.38 శాతం తగ్గింది. దీంతోపాటు ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతి, ఎల్‌అండ్‌టీలు అత్యధికంగా నష్టపోయాయి. కానీ, నెస్లె, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఏషియన్ పెయింట్స్‌లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే మెటల్, రిలయ్టీ, యుటిలిటీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయల్స్, సేవలు, కమోడిటీస్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లు నష్టపోగా..ఎఫ్ఎంసీజీ, ఐటీ, టెక్నాలజీ రంగ షేర్లు మెరిశాయి.