Ola Electric – MapMyIndia | మరో మూడు రోజుల్లో ఐపీఓకు వెళ్లనున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)’కు మ్యాప్ మై ఇండియా (MapMy India) మాతృసంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్ (CE Info Systems) షాక్ ఇచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ తమ వాహనాలకు సొంతంగా మ్యాపింగ్ సర్వీసులను ప్రవేశపెట్టేందుకు తమ డేటాను తస్కరించిందని సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ఆరోపించింది. ఈ విషయమై ఓలా ఎలక్ట్రిక్ యాజమాన్యానికి లీగల్ నోటీసు జారీ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ తమతో చేసుకున్న లైసెన్సింగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని సీఈ ఇన్ఫో సిస్టమ్స్ తన లీగల్ నోటీసులో పేర్కొంది. ఎస్1 ప్రో (S1 Pro) స్కూటర్ల కోసం నేవిగేషన్ సర్వీసులు అందించడానికి 2022లో మ్యాప్ మై ఇండియా సంస్థను భాగస్వామిని చేసింది.
తమతో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) చేసుకున్న ఒప్పందం ప్రకారం ‘లైసెన్స్డ్ ప్రొడక్టు సాఫ్ట్ వేర్ లేదా ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్) నుంచి ఏదేనీ కోడ్ సోర్స్‌ను రిప్లికేట్ చేయకుండా నిషేధం విధించినట్లు మ్యాప్ మై ఇండియా తెలిపింది. ‘మీరు మా క్లయింట్ ప్రొప్రైటరీకి చెందిన వనరుల నుంచి ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ఇంటర్ ఫేస్), ఎస్డీకేఎస్ (సాఫ్ట్వేర్ డెవలప్ మెంట్ కిట్స్) డూప్లికేట్ చేసి ఓలా మ్యాప్స్ నిర్మించారు. మీ కమర్షియల్ లాభాల కోసం మా క్లయింట్ ప్రత్యేకమైన డేటాను మీరు చట్ట విరుద్ధంగా కాపీ చేశారు’ అని సీఈ ఇన్ఫో సిస్టమ్స్ పేర్కొంది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఓలా ఎ లక్ట్రిక్.. ఈ నెల ప్రారంభంలో గూగుల్ మ్యాప్స్ స్థానే ఓలా మ్యాప్స్ ప్రవేశ పెట్టింది.
మ్యాప్ మై ఇండియా మాతృసంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ ఆరోపణలపై ఓలా ఎలక్ట్రిక్ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. ‘ఓలా మ్యాప్స్ – మ్యాప్ మై ఇండియా విషయమై సీఈ ఇన్ఫో సిస్టమ్స్ చేసిన ఆరోపణలు అసత్యం. తప్పుదోవ పట్టించేవి. వ్యాపార పద్దతుల్లో సమగ్రతకు ఓలా ఎలక్ట్రిక్ కట్టుబడి ఉంది. సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ఇచ్చిన నోటీసుకు తగిన రీతిలో స్పందిస్తాం’ అని పేర్కొన్నారు.