న్యూఢిల్లీ, ఆగస్టు 15: హైదరాబాద్‌లో రాబోతున్న ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారు కానున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి ఐఫోన్ తయారీదారు యాపిల్.. తమ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తిని ఇక్కడ ప్రారంభించనుందని సంబంధిత వర్గాలు పీటీఐకి తెలిపాయి. 3 నెలల క్రితం ఈ ఏడాది మే 15న హైదరాబాద్ సమీపంలోని కొంగర కలాన్ వద్ద తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ 500 మిలియన్ డాలర్లతో తెస్తున్న తయారీ కేంద్రానికి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరవగా, ఈ ప్లాంట్‌తో 25,000 ఉద్యోగావకాశాలు రానున్నాయి.
భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయని ఫాక్స్‌కాన్ చైర్మన్, సీఈవో యంగ్ లియు అన్నారు. సంస్థ రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా మాట్లాడుతూ.. ఫాక్స్‌కాన్ ఇండియా వార్షిక టర్నోవర్ 10 బిలియన్ డాలర్లకు చేరువైందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో వ్యాపార విస్తరణకు సంబంధించి తమకున్న ప్రణాళికల్ని పూర్తిస్థాయిలో ఆచరణలో పెడితే వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆస్కారముంటుందన్నారు. ‘ఫాక్స్‌కాన్ వార్షిక రెవిన్యూ మొత్తంగా 200 బిలియన్ డాలర్లు. పెరుగుతున్న భారతీయ మార్కెట్ పరిమాణం దృష్ట్యా.. ఇక్కడ మా వ్యాపార విస్తరణకు దిగితే ఆరంభంలోనే బిలియన్ డాలర్లలో పెట్టుబడులకు వీలున్నది’ అన్నారు. అలాగే ప్రస్తుతం దేశీయంగా ఫాక్స్‌కాన్ దాదాపు 9 క్యాంపస్‌లను నిర్వహిస్తున్నదని, దేశవ్యాప్తంగా 30కిపైగా ఫ్యాక్టరీలున్నాయని, 20కిపైగా వసతి గృహాలున్నాయని, అందులో సంస్థలో పనిచేస్తున్న వేలాది ఉద్యోగులు ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. యాపిల్‌తోపాటు, నోకియా, సిస్కో, సోని, షియామీ తదితర ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థల ఉత్పత్తులను ఫాక్స్‌కాన్ తయారు చేస్తున్న విషయం తెలిసినదే.
యాపిల్ కంపెనీ ఇప్పటికే భారత్‌లో పలు సిరీస్‌ల ఐఫోన్లను తయారు చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తికీ యాపిల్ సిద్ధమవుతుండగా, ఆ కంపెనీ దేశీయంగా తయారు చేస్తున్న రెండో ప్రోడక్ట్ ఇది కానున్నది. ఇక అంతర్జాతీయ ట్రూ వైర్లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) మార్కెట్లో యాపిల్ ఎయిర్పాడ్సే రారాజుగా కొనసాగుతున్నాయి. నిరుడు డిసెంబర్‌కల్లా మార్కెట్లో దాదాపు 36 శాతం వాటా యాపిల్ ఎయిర్పాడ్స్దే. ఆ తర్వాతి స్థానాల్లో సామ్సంగ్ (7.5 శాతం), షియామీ (4.4 శాతం), బోట్ (4 శాతం), ఒప్పో (3 శాతం) కంపెనీలున్నాయి. నోయిడాలోని ప్లాంట్‌లో షియామీ ఈ ఏడాదే టీడబ్ల్యూఎస్ ఉత్పత్తుల తయారీని ప్రారంభించింది.