Footwear | ప్రజలకు నాణ్యమైన పుట్వేర్ అందుబాటులోకి తేవడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఫుట్ వేర్ తయారీలో కూడా బీఐఎస్ నిర్దేశిత ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. భారీ, మధ్య తరహా ఫుట్వేర్ తయారీ పరిశ్రమలు, దిగుమతి దారులు ఈ నిబంధనలు పాటించాలి. 24 రకాల ఫుట్వేర్, ఫుట్వేర్ అనుబంధ ఉత్పత్తులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు వచ్చే ఏడాది జూలై వరకు గడువు ఇస్తున్నట్లు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. నాణ్యత నియంత్రణ విషయంలో గడువు పొడిగించబోమని స్పష్టం చేశారు. ప్రత్యేకించి చైనా వంటి దేశాల నుంచి నాణ్యత లేని పుట్వేర్ల దిగుమతికి చెక్ పెట్టడం కేంద్రం లక్ష్యంగా కనిపిస్తున్నది.
ఫుట్వేర్, ఫుట్వేర్ అనుబంధ ఉత్పత్తుల తయారీకి అనుసరించాల్సిన ప్రమాణాలపై కేంద్రం 2020 అక్టోబర్లో ఆదేశాలు జారీ చేసినా.. ఈ గడువు పలుసార్లు వాయిదా పడుతున్నది. కానీ, భారీ, మధ్య తరహా పరిశ్రమలు వచ్చేనెల నుంచి ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని బీఐఎస్ డీజీ ప్రమోద్ కుమార్ తివారీ స్పష్టం చేశారు. సోల్స్, హై హీల్స్ వంటి ఫుట్వేర్ విడి భాగాలతోపాటు వాటి తయారీకి వాడే లెదర్, పీవీసీ, రబ్బర్ విషయంలో పాటించవలిసిన ప్రమాణాలను బీఐఎస్ ఖరారు చేసింది. మొత్తం 54 రకాల ఉత్పత్తులకు 27 రకాల ఉత్పత్తులపై క్వాలిటీ కంట్రోల్ తీసుకొచ్చిన కేంద్రం.. వచ్చే ఆరు నెలల్లో మిగతా ఉత్పత్తులనూ క్వాలిటీ కంట్రోల్ పరిధిలోకి తెస్తామని బీఐఎస్ డీజీ పీకే తివారీ తెలిపారు.