హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ప్రముఖ జ్యుయెల్లర్ మలబార్ గోల్డ్‌కు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని టీఎస్ఐఐసీ జనరల్ పార్క్‌లో 6 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రూ.650 కోట్ల పెట్టుబడితో ఓ మెగా బంగారు, వెండి నగల తయారీ ప్లాంట్‌ను ఇక్కడ మలబార్ గోల్డ్ ఏర్పాటు చేయనున్నది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,800 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. త్వరలోనే ప్లాంట్ నిర్మాణ పనులు మొదలవనున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో సంస్థ ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో సమావేశమై ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించగా, టీఎస్ఐఐసీ 6 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. పసిడి, వెండి, వజ్రాభరణాలతోపాటు యాంటిక్, టెంపుల్, ప్లాటినమ్ నగలు, బంగారు నాణేలు, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ సర్టిఫైడ్ బులియన్, ప్రపంచ శ్రేణి బ్రాండెడ్ గడియారాలు సంస్థ తయారు చేయనున్నది. ఇక్కడి ప్లాంట్‌లో మెటల్ మెల్టింగ్, రోలింగ్, డై మేకింగ్, సోల్డరింగ్, ఎనామలింగ్, డ్రమ్ పాలీష్, స్టోన్ సెట్టింగ్, ఎలక్ట్రోప్లేటింగ్/కలరింగ్, క్వాలిటీ టెస్టింగ్, హాల్‌మార్కింగ్ తదితర ప్రక్రియలు చేపట్టనున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా అధునాతన డిజైన్లతో కూడిన ఆభరణాలను తయారు చేసేందుకు సంస్థ తెలంగాణను ఎంచుకోవడం విశేషం.
