హైదరాబాద్, జనవరి 18: ఈ ఏడాది దేశంలో ఇండ్ల ధరలు పెరుగుతాయని మెజారిటీ రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా వేస్తున్నారు. తాజాగా విడుదలైన ఒక సర్వేలో 58 శాతం రియాల్టర్లు ఇండ్ల ధరలు ప్రియం అవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 32 శాతం మంది మాత్రం ధరలు స్థిరంగా ఉంటాయన్నారు. రియాల్లర్ల అసోసియేషన్ క్రెడాయ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లిర్స్ ఇండియా, ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థ లియాసెస్ ఫొరాస్లు కలసి నిర్వహించిన‘రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సెంటిమెంట్ సర్వే’లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 341 మంది రియల్ ఎస్టేట్ డెవలపర్లు పాల్గొన్నారు.
2023లో నివాస గృహాలకు డిమాండ్ స్థిరంగా ఉంటుందని 43 శాతం మంది, డిమాండ్ 25 శాతం వరకూ పెరుగుతుందని 31 శాతం మంది అంచనా వేశారు. మెజారిటీ రియాల్టర్లు మాత్రం అధిక ముడి వ్యయాలు, ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా హౌసింగ్ ధరలు పెరుగుతాయని చెప్పారు. పెరుగుతున్న ముడి వ్యయాల ఫలితంగా ప్రాజెక్ట్ వ్యయాలు 10-20 శాతం పెరగవచ్చని 43 శాతం మంది డెవలపర్లు అంచనా వేశారు.