Canada – Mahindra | కెనడా (Canada), భారత్ (India) మధ్య దౌత్యపరంగా ఆరోపణలు.. ప్రత్యారోపణలు జరుగుతున్న నేపథ్యంలో దేశీయ కార్పొరేట్ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కీలక నిర్ణయం తీసుకున్నది. కెనడా కేంద్రంగా పని చేస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) అనుబంధ సంస్థ రెస్సాన్ ఏయిరోస్పేస్ కార్పొరేషన్ (Resson Aerospace Corporation) ను మూసేస్తున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. రెండు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితుల్లో మహీంద్రా తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. కానీ రెసాన్ ఎయిరోస్పేస్ కార్పొరేషన్ మూసివేతకు గల కారణాలను మహీంద్రా వెల్లడించలేదు. ఈ విషయమై ప్రకటన కూడా చేయలేదు.
రెసాన్ ఎయిరోస్పేస్ కార్పొరేషన్లో మహీంద్రాకు 11.18 శాతం వాటాలు ఉన్నాయి. స్వచ్చందంగానే కంపెనీ మూసేస్తున్నట్లు మహీంద్రా తెలిపింది. రెసాన్ ఎయిరోస్పేస్ కార్పొరేషన్‌ను మూసేస్తున్నట్లు కెనడా కార్పొరేషన్స్‌లో దరఖాస్తు చేసింది. ఈ నెల 20న దానికి ఆమోదం లభించిందని మహీంద్రా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరించింది.
మూసివేత వల్ల రెసాన్ ఎయిరోస్పేస్ కార్పొరేషన్ నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా వాటాకు అనుగుణంగా రూ.28.7 కోట్ల మనీ వస్తుంది. ఈ వార్త తెలియడంతో శుక్రవారం మధ్యాహ్నం స్టాక్ మార్కెట్లలో 2.32 గంటల సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 1.92 శాతం నష్టంతో రూ.1602.55 వద్ద స్థిర పడి, తిరిగి రూ.1606.70 వద్ద ముగిసింది.