Mahindra BS-6 2.0 Thar | దేశీయ ఆటోమొబైల్ జెయింట్ మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో దేశీయ మార్కెట్లోకి న్యూ ఇంజిన్‌తో `థార్` అందుబాటులోకి తేనున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెండోదశ బీఎస్-6 ప్రమాణాలను ఆటోమొబైల్ కంపెనీలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు బీఎస్-6 రెండో దశ ప్రమాణాలకు అనుగునంగా తమ కార్లు, ఇతర వాహనాల ఇంజిన్లను అప్డేట్ చేసే పనిలో పడ్డాయి. ఆ బాటలోనే మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఎమిషన్ (ఆర్డీఈ) నిబంధనలకు అనుగుణంగా తన `థార్` కారు ఇంజిన్ అప్డేట్ చేస్తున్నది. ఈ – 20 (ఇథనాల్ 20% + 80 % పెట్రోల్) పెట్రోల్ ఇంజిన్‌తోపాటు ఆర్డీఈ నిబంధనలకు లోబడి డీజిల్ ఇంజిన్ `థార్` కూడా ఆవిష్కరించనున్నది.
`థార్`తోపాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎస్యూవీ పోర్ట్‌ఫోలియో కార్లలోనూ ఇంజిన్లను అప్డేట్ చేయాలని మహీంద్రా అండ్ మహీంద్రా సంకల్పించింది. ఆ జాబితాలో ఎస్యూవీ 300, ఎస్యూవీ 700, స్కార్పియో, బొలెరో, బొలెరో నియో, మరాజో ఎంవీపీ మోడల్స్ ఉన్నాయి.
గత జనవరిలోనే చౌక ధరలో థార్ కారును ఆవిష్కరించింది. థార్ ఎస్యూవీ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలు పలికింది. తాజాగా ఆర్డీఈ నిబంధనకు అనుగుణంగా ఇంజిన్ అప్డేట్ చేయడం వల్ల అదనంగా రూ.50 వేలు ధర పెరుగనున్నది.
ప్రస్తుతం థార్ 4X4 మోడల్ కారు 2.2-లీటర్ల డీజిల్, 2.0-లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో యూజర్లకు అందుబాటులో ఉంది. తాజా అప్డేట్ ప్రకారం థార్ 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఆర్డీఈ నిబంధనలకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చే ఈ థార్ కారు ఇంజిన్ 117 బీహెచ్‌పీల విద్యుత్, 300 ఎన్ఎంల టార్చిని వెలువరిస్తున్నది.
ఇప్పుడు మహీంద్రా థార్ ఆరు కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రోంజ్, అక్వా మారైన్, రెడ్ రేజ్, నపోలి బ్లాక్, గెలాక్సీ గ్రే రంగుల్లో అందుబాటులో ఉన్నది. ఇప్పటి వరకు 2డబ్ల్యూడీ మోడల్ థార్ కార్లు మాత్రమే ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రోంజ్ రంగుల్లో లభ్యం అవుతున్నాయి.