హైదరాబాద్, జనవరి 18: లండన్ స్టాక్ ఎక్సేంజ్ గ్రూపు(ఎల్ఎస్ఈజీ)..హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ గతేడాది లండన్ పర్యటనలో భాగంగా కుదిరిన ఒప్పందం ప్రకారం సంస్థ..అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా ఇక్కడ నూతన టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించింది.
వచ్చే ఏడాది చివరినాటికి ఈ సెంటర్ కోసం వెయ్యి మంది ఇంజినీర్లు, ప్రొఫెషనర్లను నియమించుకోనున్నట్టు ఎల్ఎస్ఈజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి ఇర్ఫాన్ తెలిపారు. కస్టమర్లకు అధునాతన ఉత్పత్తులను అందించడానికి సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తున్నదని, దీంట్లోభాగంగా నూతన ఏర్పాటు చేసిన సెంటర్లో టెక్నాలజీ రంగంలో మంచి పట్టున్న సిబ్బందిని నియమించుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం హైటెక్ సిటీలో నెలకొల్పిన సెంటర్లో ప్రస్తుతం 300 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.