ముంబై, మార్చి 10: స్టాక్ మార్కెట్‌కు సంబంధించి వివిధ కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న 25 మంది వ్యక్తుల జాబితాను సెబీ విడుదల చేసింది. ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి ఇవ్వకపోవడం, వివిధ మార్కెట్ నేరాలకుగాను విధించిన జరిమానాలు చెల్లించకపోవడం వంటి అంశాల్లో డిఫాల్టర్ల వివరాల్ని సెబీ తాజాగా తన వెబ్సైట్లో పొందుపర్చింది. తమ వద్దనున్న ఆయా వ్యక్తుల చిరునామాలకు నోటీసులు పంపించినట్టు సెబీ తెలిపింది. 2014 జూలై-2022 జనవరి మధ్యకాలంలో జరిగిన ఉదంతాల్లో తమ రికవరీ ఆఫీసర్ నోటీసులు జారీచేసారన్నది. ఈ మార్చి 24లోగా డిఫాల్టర్లు లేఖ రాయడం, ఈ మెయిల్ చేయడం ద్వారా తమ రికవరీ ఆఫీసర్‌ను కాంటాక్ట్ చేయాలని సెబీ ఆదేశించింది. అలాగే ఈ డిఫాల్టర్ల ఆచూకీ తెలిసినవారు వివరాల్ని లేఖ/ఈమెయిల్ ద్వారా రికవరీ ఆఫీసర్‌కు మార్చి 24లోగా తెలియపర్చాలని సెబీ కోరింది. ఇన్వెస్టర్ల సొమ్మును రిఫండ్ చేసేలా ఉత్తర్వులు జారీచేసే అధికారాలు తమకు ఉన్నాయని, విధించబడిన పెనాల్టీలను వసూలు చేస్తామని ఈ సందర్భంగా సెబీ వివరించింది.