న్యూఢిల్లీ, మే 27: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.13,763 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.13,428 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం రెండు శాతం మాత్రమే పెరిగింది. ఉద్యోగుల వేతనాలు పెంచడం వల్లనే లాభాలు తగ్గుముఖం పట్టాయని ఎల్ఐసీ చైర్మన్ సిద్దార్థ మోహంతీ తెలిపారు. నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడంతో ఈ ఏడాది రెండంకెల వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని మోహంతీ వెల్లడించారు. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,00,185 కోట్ల నుంచి రూ.2,50,923 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది. దీంట్లో తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు(జనవరి-మార్చి మధ్యకాలంలో) రూ.12,811 కోట్ల నుంచి రూ.13,810 కోట్లకు చేరుకున్నాయి. అలాగే రెన్యూవల్ ప్రీమియం వసూళ్లు రూ.76 వేల కోట్ల నుంచి రూ.77,368 కోట్లకు పెరిగాయి.