LIC | ఇప్పుడు రోజురోజుకు పెరిగిపోతున్న ఖర్చులు.. కుటుంబ అవసరాలు ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రత్యేకించి రిటైర్మెంట్ దగ్గర్లో ఉన్న వారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుంది. ఒకేసారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినా.. తర్వాత ప్రతి నెలా కుటుంబ ఖర్చులు ఎలా అన్న విషయమై మదన పడుతున్నారు. ఇటువంటి వారిని ఇన్వెస్ట్మెంట్ వైపు ప్రోత్సహించి నెలవారీగా ఆదాయం అందించే పలు పథకాలు పాపులర్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ).. కొత్త పెన్షన్ స్కీం ‘సరళ్ పెన్షన్’ తీసుకొచ్చింది. పాలసీదారుడు ఒకేసారి ఎక్కువ మొత్తం ప్రీమియం చెల్లింపుతో పెన్షన్ పొందొచ్చు. ఈ పాలసీలో రెండు ఆప్షన్లు ఉన్నాయి.
ఎల్ఐసీ సరళ్ పెన్షన్ కింద పాలసీదారుడు జీవితాంతం పెన్షన్ పొందడం ఒక ఆప్షన్ అయితే, పాలసీదారు మరణించిన తర్వాత 100 శాతం రిటర్న్స్‌తో ఉమ్మడి జీవిత వార్షికాదాయం పొందే ఆప్షన్. తొలి ఆప్షన్ ప్రకారం పాలసీదారు జీవించి ఉన్నంత వరకూ యాన్యుటీ చెల్లింపులు వాయిదాల వారీగా చెల్లిస్తారు. వ్యక్తి మరణిస్తే యాన్యుటీ చెల్లింపులు నిలిచిపోయి.. నామినీకి 100 శాతం మొత్తం చెల్లిస్తుంది ఎల్ఐసీ. రెండో ఆప్షన్ ప్రకారం పాలసీదారు, ఆ వ్యక్తి జీవిత భాగస్వామి జీవించి ఉన్నంత కాలం యాన్యుటీ బ్యాలెన్స్ చెల్లిస్తారు. జాయింట్ లైఫ్ యాన్యుటీ మాత్రం జీవిత భాగస్వామితో మాత్రమే తీసుకోవాలి.
ఇక ఎల్ఐసీ సరళ్ పెన్షన్ పాలసీ కొనుగోలుకు40 ఏండ్లు కనీస వయస్సు, 80 ఏండ్లు గరిష్ట వయస్సుగా నిర్ణయించింది. ఈ బీమా పథకం కింద చెల్లించే యాన్యుటీని నెలవారీ, త్రైమాసికం, వార్షిక ప్రాతిపదికన చెల్లించేలా ఆప్షన్ ఎంచుకోవచ్చు. పాలసీ ప్రారంభ సమయంలోనే ఎల్ఐసీ తన పాలసీ డాక్యుమెంట్‌తోపాటు యాన్యుటీ రేట్ల హామీ ఇస్తుంది. తదనుగుణంగా పాలసీదారుకు జీవిత కాలం అంతా యాన్యుటీ వాయిదాలు చెల్లిస్తుంది. ఉదాహరణకు 60 ఏండ్ల వయస్సు గల వ్యక్తి రూ.10 లక్షల పెట్టుబడితో వార్షిక యాన్యుటీ ఆప్షన్ ఎంచుకుంటే ఏటా రూ.58,950 యాన్యుటీ వస్తుంది. ఈ స్కీం పూర్తి వివరాలను ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా గానీ, స్థానిక ఎల్ఐసీ ఆఫీస్ ద్వారా గానీ పొందొచ్చు.