LIC Saral Pension | 40 ఏండ్ల నుంచి 80 ఏండ్ల లోపు వయస్సు గల వారి కోసం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) పెన్షన్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. సరళ్ పెన్షన్ యోజన పేరిట తీసుకొచ్చిన ఈ బీమా పథకంలో పలు బెనిఫిట్లు ఉన్నాయి. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. జీవిత కాలం అంతా బీమా పాలసీ దారు.. అటుపై నామినీ, వారసులు పెట్టుబడి మొత్తం పొందొచ్చు.
40 ఏండ్లు దాటిన వారు పెట్టుబడి పెట్టిన వెంటనే పెన్షన్ పొందొచ్చు. కనీస ఫించను రూ.1000 నుంచి ప్రారంభం అవుతుంది. గరిష్ట పరిమితేమీ లేదు. ఇమిడియెట్ యాన్యుటీ క్యాటగిరీలోకి వచ్చే ఎల్ఐసీ సరళ్ పెన్షన్ పథకం కొనుగోలు చేసినప్పుడే ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకోవచ్చు.
సరళ్ పెన్షన్ స్కీమ్ కింద రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఎంచుకుంటే పాలసీదారు జీవితాంతం పెన్షన్ పొందొచ్చు. ఆయన తర్వాత పూర్తి మొత్తం పెట్టుబడి నామినీకి చెల్లిస్తారు. రెండో ఆప్షన్లో ఉమ్మడిగా తీసుకునే జాయింట్ లైఫ్ ఆప్షన్ కింద పాలసీదారుకు.. తదనంతరం వారి జీవిత భాగస్వామికి పెన్షన్ లభిస్తుంది. భార్యాభర్తలిద్దరూ మరణించాక వారి వారసులకు పెట్టుబడి మొత్తం చెల్లిస్తారు. పాలసీదారులు ఒకసారి స్కీమ్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మార్చడానికి వీల్లేదు.
40 ఏండ్లు దాటిన వారు ఈ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. 80 ఏండ్ల లోపు వారూ ఈ పాలసీలో చేరొచ్చు. నెలకు కనిష్టంగా రూ.1000 చొప్పున పెన్షన్ పొందేలా.. సంవత్సరానికి రూ.12 వేల పెన్షన్ వచ్చేలా యాన్యుటీ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి లిమిట్ లేదు.
60 ఏండ్ల ప్రవీణ్ కుమార్ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యోజన స్కీమ్‌లో తొలి ఆప్షన్ ఎంచుకుని రూ.10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాడనుకుందాం.. అలా చేస్తే ఏటా రూ.58,590 ఫించను వస్తుంది. అతడి భార్య లలితా కుమారితో కలిసి రెండో ఆప్షన్ ఎంచుకున్నట్లయితే రూ.58,250 పెన్షన్ పొందుతారు. ఫస్ట్ ఆప్షన్ ప్రకారం జీవితం అంతా పెన్షన్ పొందిన పాలసీదారుడు మరణించిన తర్వాత పూర్తి మొత్తం నామినీలకు చెల్లిస్తారు. రెండో ఆప్షన్ కింద పాలసీదారులు మరణిస్తే వారి జీవిత భాగస్వాములకు.. భార్యాభర్తల ఇద్దరి తదనంతరం వారి వారసులకు మొత్తం పెట్టుబడి పే చేస్తారు.
ఎల్ఐసీ సరళ్ పెన్షన్ కింద (యాన్యుటీ) బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి ఆ వ్యక్తిపై ఆధార పడిన వారు తీవ్ర అనారోగ్యానికి గురి కావచ్చు. అటువంటప్పుడు ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరిన ఆరు నెలల తర్వాత బీమా బాండ్ స్వాధీనం చేయడానికి కొన్ని రూల్స్ అనుమతిస్తాయి. స్కీమ్‌లో చేరిన ఆరు నెలల తర్వాత కొంత లోన్ ఫెసిలిటీ కూడా ఎల్ఐసీ కల్పిస్తోంది. యాన్యుటీ బాండ్‌గా పరిగణిస్తున్న ఈ సరళ్ పెన్షన్ యోజన బీమా పాలసీని ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారికి ఎల్ఐసీ ప్రత్యేక ప్రోత్సాహం ప్రకటించింది.