LIC | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ రికార్డు స్థాయి ప్రీమియం వసూళ్లు సాధించింది. గత నెలలో ఏకంగా రూ.19,309.10 కోట్ల నూతన బిజినెస్ ప్రీమియం వసూలైనట్లు తెలిపింది. నిరుడు ఆగస్టులో రూ.14,292.53 కోట్లే. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో రూ.95,180.63 కోట్ల నూతన బిజినెస్ ప్రీమియం వసూలైనట్లు వెల్లడించింది. మరోవైపు, గత నెలలో పాలసీల జారీ ఏడాది ప్రాతిపదికన 4.45 శాతం తగ్గి 17.12 లక్షల నుంచి 16.36 లక్షలకు తగ్గాయని తెలిపింది.
లైఫ్ ఇన్సూరెన్స్‌లో 22 శాతం వృద్ధి
గత నెలలో జీవిత బీమా నూతన ప్రీమియం వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 22 శాతం అధికమై రూ.32,644 కోట్లకు చేరుకున్నాయి. అలాగే నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్లు తొలి ఐదు నెలల్లో 21 శాతం పెరిగి రూ.1,54,194 కోట్లకు చేరాయి.