LIC-Health Insurance | కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ ‘భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)’.. ఆరోగ్య బీమా రంగంలో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తున్నది. అందుకోసం మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలో 50 శాతం వాటా కొనుగోలుకు చర్చిస్తున్నట్లు సమాచారం. ఎల్ఐసీ ప్రస్తుతానికి జీవిత బీమాకు పరిమితమైనా.. తన పోర్ట్ ఫోలియోను ఆరోగ్య రంగానికి విస్తరించడానికి మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ లో వాటా కొనుగోలు ఉపకరిస్తుంది.
అమెరికా సిగ్నా కార్పొరేషన్, మణిపాల్ ఎడ్యుకేషన్-మెడికల్ గ్రూప్ జాయింట్ వెంచర్ బీమా సంస్థే మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్. ఇందులో మణిపూర్ గ్రూపునకు 51 శాతం, సిగ్నా కార్పొరేషన్‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలో 50 శాతం వాటా కొనుగోలు కోసం ఎల్ఐసీ చర్చిస్తున్నది. దీనికి అనుగుణంగా రెండు సంస్థలు తమ వాటా తగ్గించుకోనున్నాయి. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఓ ఆంగ్ల దినపత్రిక వార్తకథనం.
ఆరోగ్య బీమా రంగంలోకి ఎంటర్ కావాలని భావిస్తున్నామని గతంలోనే ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి చెప్పారు. ఇప్పటికే ఆరోగ్య రంగంలో సేవలందిస్తున్న బీమా సంస్థలో వాటాలను కొనుగోలు చేస్తామని, అందుకు కసరత్తు జరుగుతున్నదన్నారు. మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలో ఎల్ఐసీ రూ.1750-2000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నదని తెలుస్తున్నది.