హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో త్వరలోనే అత్యాధునిక లెదర్ క్లస్టర్ ఏర్పాటుకానున్నది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర తోళ్ల పరిశ్రమ అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎల్‌ఐపీసీ), తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్య మండళ్ల సమాఖ్య (టీఎస్ఐఐసీ) ఒప్పందం చేసుకోనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న లెదర్ క్లస్టర్ ఏర్పాటుపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వివిధ సమస్యలను పరిష్కరించారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 28 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ క్లస్టర్లో మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, నైపుణ్య శిక్షణ తదితర సదుపాయాలు కల్పించడానికి పది కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఆధునిక డిజైన్లతో, నాణ్యమైన లెదర్ వస్తువులను తయారు చేసేందుకు ఆ రంగంతో సంబంధం ఉన్న వివిధ ఏజెన్సీల సహకారం తీసుకోనున్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేట్ సంస్థలకు కూడా ఇక్కడి ఉత్పత్తులను సరఫరా చేయాలని నిర్ణయించారు.
ఆర్మూర్ లెదర్ క్లస్టర్ అభివృద్ధికి అవసరమైన భూమి, నిధులు సిద్ధంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఒకట్రెండు రోజుల్లోనే టీఎస్ఐఐసీతో ఒప్పందం చేసుకుంటాం. ఈ క్లస్టర్ అభివృద్ధితో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1,500 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ క్లస్టర్లో అత్యాధునిక డిజైన్లతో నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం.
–శ్రీనివాస్‌నాయక్, వైస్ చైర్మన్, టీఎస్‌ఎల్‌ఐపీసీ
కేటాయించిన భూమి : 28 ఎకరాలు
మౌలిక వసతుల కల్పనకు నిధులు: రూ.10 కోట్లు
ఏర్పాటు చేయనున్న యూనిట్లు: 150
ఉపాధి అవకాశాలు: 1,500 మందికి