హైదరాబాద్, మే 30: ప్రముఖ ఆసుపత్రుల నిర్వహణ సంస్థ అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.390 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.254 కోట్లతో పోలిస్తే 54 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.4,944 కోట్ల నుంచి రూ.5,592 కోట్లకు ఎగబాకినట్టు వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.21,794 కోట్ల ఆదాయంపై రూ.1,446 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకున్నది.
ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మాట్లాడుతూ..వచ్చే ఐదేండ్లలో రూ.8 వేల కోట్ల పెట్టుబడితో మరో 4,300 పడకలను ఏర్పాటు చేయబోతున్నట్లు, దీంట్లో తొలి దశలో 2 వేల పడకల అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నాయన్నారు. దీంతోపాటు హైదరాబాద్, పుణె, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్లలో ఏర్పాటు చేస్తున్న కేర్ టచ్పాయింట్లు, నూతన ఆసుపత్రులు ఈ ఏడాది అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. రోగులకు ప్రపంచస్థాయి చికిత్స అందించాలనే ఉద్దేశంతో నూతన మెడికట్ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు రూ.10 తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.