న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్..క్విక్ కామర్స్ సేవలను మరో 100 నగరాలకు విస్తరించింది. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు నిమిషాల్లోనే వారి వస్తువులను అందించాలనే ఉద్దేశంతో గతంలో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు నగరాలకు విస్తరించిన క్విక్ కామర్స్ సేవలను హైదరాబాద్‌తోపాటు కొచ్చి, అమృత్సర్, మంగళూరు, వైజాగ్, లక్నో వంటి నగరాల్లో నిమిషాల్లోనే వేగవంతంగా డెలివరీ చేయడానికి ఈ సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఇందుకోసం ఆయా నగరాల్లో వెయ్యికి పైగా చిన్న స్థాయి గిడ్డంగులను సైతం నెలకొల్పింది.
ప్రధానంగా నిత్యావసర వస్తువులతోపాటు మరిన్ని ఉత్పత్తులను సైతం నిమిషాల్లోనే డెలివరీ చేయనుండగా, మరొక 40 లక్షల ఉత్పత్తులను మాత్రం బుకింగ్ చేసుకున్న మరుసటి రోజు చేయనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో బుకింగ్ చేసుకున్న వస్తువుకోసం రోజుల తరపడి వేచి చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నూతన సేవల కోసం సంస్థ రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.