Small Savings | చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనూ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పాత వడ్డీరేట్లే కొనసాగుతాయి. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి పథకాలపై కేంద్రం వరుసగా మూడో త్రైమాసికంలో వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగించినట్లయింది. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్, జూలై-సెప్టెంబర్ త్రైమాసికాల్లో కొనసాగిన వడ్డీరేట్లే డిసెంబర్ త్రైమాసికంలోనూ కొనసాగుతాయని ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది.
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకంపై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. మూడేండ్ల టర్మ్ డిపాజిట్ మీద 7.1 శాతం, పీపీఎఫ్ పై 7.1, పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్ మీద నాలుగు, కిసాన్ వికాస పత్ర పథకంపై 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ మీద 7.7 శాతం, మంత్లీ ఇన్కం స్కీమ్ పై 7.4 శాతం వడ్డీ పొందొచ్చునని తన నోటిఫికేషన్లో ఆర్థికశాఖ వివరించింది.