Big Changes in August | చరిత్రలో మరో నెల కాలగర్భంలో కలిసిపోయేందుకు.. కొత్త నెల ప్రారంభం కావడానికి దాదాపు 60 గంటల టైం ఉంది. ఆగస్టు నెల నుంచి పలు మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులతో మీలో ప్రతి ఒక్కరి ఆదాయం, జీవన శైలిపైనా ప్రతికూల, సానుకూల ప్రభావం పడుతుంది. కనుక రాబోయే ఆ మార్పులు, చేర్పులకు సంబంధించి అమల్లోకి వచ్చే నిబంధనల గురించి తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఖాతాదారుల చెక్ పేమెంట్ విధానంలో మార్పులు తీసుకొస్తున్నది. ఆగస్టు ఒకటో తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే రూ.5000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి కేవైసీ పత్రాలు సమర్పించడానికి ఈ నెలాఖరుతో గడువు ముగియనున్నది.
ఆగస్టు ఒకటో తేదీ నుంచి చెక్ చెల్లింపుల నిబంధనలను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మార్చేయనున్నది. వచ్చే సోమవారం నుంచి రూ.5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ గల చెక్ చెల్లింపులకు పాజిటివ్ పే విధానం అమల్లోకి తెస్తున్నట్లు బ్యాంక్ తన ఖాతాదారులకు తెలిపింది. సురక్షితంగా చెక్ పేమెంట్ జరగడానికి, సైబర్ మోసాలను అరికట్టడానికి ఈ పాలసీని తీసుకొస్తున్నది.
కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద బెనిఫిట్ పొందాలనుకునే రైతులు ఈ నెల 31 లోగా తమ కేవైసీ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో 12వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం సంబంధిత రైతులు అందుకోలేరు. ఆగస్టు ఒకటో తేదీ తర్వాత కేవైసీ సబ్మిట్ చేయడానికి కూడా సాధ్యం కాదు. కనుక రైతులు తమ సమీప కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) వద్దకెళ్లి తమ కేవైసీ పత్రాలు దాఖలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
జూలై 31 తర్వాత.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి వేతన జీవులు ఐటీఆర్ ఫైల్ చేస్తే లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షలకు పైగా వార్షిక ఆదాయం గల వారు రూ.5000 లేట్ ఫీజు, రూ.5 లక్షల్లోపు ఆదాయం గల వారు రూ.1000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను కేంద్ర చమురు సంస్థలు సమీక్షిస్తాయి. ప్రస్తుతం సహజ వాయువు ధరలు పెరుగుతన్న నేపథ్యంలో వంటింటి, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.