న్యూఢిల్లీ, జూన్ 9: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జ్యువెల్లరీ..స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. ఈ వాటాల విక్రయం ద్వారా గరిష్ఠంగా రూ.1,700 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది. దీంట్లో తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.1,200 కోట్లు, కంపెనీ సీఎండీ కిరణ్ కుమార్ జైన్‌కు చెందిన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించడం ద్వారా మరో రూ.500 కోట్లను సేకరించాలని నిర్ణయించింది. ఈ విషయం సెబీకి సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)లో వెల్లడించింది.
అర్హత కలిగిన ఉద్యోగులకు రాయితీతో కూడిన షేర్లను కేటాయించనున్నది సంస్థ. ఈ వాటాల విక్రయంతో వచ్చిన నిధుల్లో రూ.1,014.50 కోట్లను నూతన స్టోర్లను ఏర్పాటు చేయడానికి, కార్పొరేట్ అవసరాల నిమిత్తం వినియోగించనున్నట్టు ప్రకటించింది. 1985లో చెన్నైలో తన తొలి స్టోర్‌ను ప్రారంభించిన సంస్థ..ప్రస్తుతం తన స్టోర్ల సంఖ్యను 56కి పెంచుకున్నది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 22, తమిళనాడులో 20, కేరళలో ఏడు, తెలంగాణలో ఆరు, పుదుచ్చేరిలో ఒక్క స్టోర్‌ను నిర్వహిస్తున్నది. డిసెంబర్, 2024తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికిగా సంస్థ రూ.12,594.67 కోట్ల ఆదాయంపై రూ.262.33 కోట్ల నికర లాభాన్ని గడించింది.