హైదరాబాద్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): మెడికల్, స్మార్ట్ బూట్ల తయారీలో అగ్రగామి సంస్థయైన కొరియాకు చెందిన ‘షూఆల్స్’..తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి 750 ఎకరాల స్థలం కావాలని, దీంట్లో రూ.300 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని షూఆల్స్ ప్రతినిధులు కోరినట్టు ఆయన వెల్లడించారు. 87 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ‘గిగా ఫ్యాక్టరీ’ ప్రతిపాదన కూడా కంపెనీ ప్రతినిధులు చేసినట్లు మంత్రి చెప్పారు.
అడుగు భాగాన మెడికల్ చిప్ ఉండే బూట్లతో పదివేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే షూతోపాటు డయాబెటీస్, ఆర్థరైటిస్ ఉన్నవారికి ఉపశమనం కలిగించే పలు రకాల ఉత్పత్తుల తయారీకోసం 750 ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రతిపాదించారని తెలిపారు. ఈ ప్లాంట్‌లో తయారుకానున్న ఉత్పత్తులు దేశీయ అవసరాలతోపాటు అమెరికాతోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నది. బూట్ల అడుగు భాగాన జీపీఎస్ ఉండే షూలతో పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ట్రాక్ చేయవచ్చని తెలిపారు. ఈ షూ ధరించిన వారు ప్రమాదానికి గురైనా, మరే ఆపదలో చికుకున్నా కుటుంబ సభ్యులకు సిగ్నల్స్ వెళ్లనున్నాయి.
అమెరికాలోని జాన్ హాపిన్స్ లాంటి ప్రఖ్యాత హాస్పిటళ్లను తీసుకురావడంతో పాటు పరిశోధన కేంద్రాలు, బయో మెడికల్ సెంటర్లు, యాన్సిలరీ పరిశ్రమల కోసం 5,000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే ఆసియాలో ఎకడా లేని విధంగా స్మార్ట్ హెల్త్ సిటీని నెలకొల్పే ప్రతిపాదన కూడా కొరియా బృందం చేసిందని శ్రీధర్ బాబు తెలిపారు.
రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు జర్మనీలోని రైన్‌ల్యాండ్ రాష్ట్రం ఆసక్తి కనబరుస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రైన్‌ల్యాండ్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందంతోపాటు చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కలిసి సచివాలయంలో శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.